గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By pnr
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (17:15 IST)

ఆ చేపలోని విషం సైనైడ్ కంటే 1200 రెట్లు అధికం.. కానీ చేప కూర వండాలంటే కఠోర శిక్షణ తీసుకోవాల్సిందే!

సాధారణంగా చేపల కూర అంటే ఇష్టపడని వారుండరు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన చేపలను తెచ్చుకుని తమకు తోచిన విధంగా వంట చేసుకుని ఆరగిస్తుంటారు.

సాధారణంగా చేపల కూర అంటే ఇష్టపడని వారుండరు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన చేపలను తెచ్చుకుని తమకు తోచిన విధంగా వంట చేసుకుని ఆరగిస్తుంటారు. అలాగే, జపనీయులకు కూడా ఓ చేప కూర అంటే అమితమైన ఇష్టం. కానీ, ఆ చేప కూర వండాలంటే మాత్రం నాలుగేళ్ళ పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉందట. ఇంతకీ చేప ఏంటో.. శిక్షణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 
 
జపాన్ దేశంలో లాగొసెఫలస్‌ జాతికి చెందిన పుఫ్పర్‌ ఫిష్‌‌ను ఆ దేశ ప్రజలు ‘ఫుగు’ అనే పిలుస్తారు. దీనిని వారు అమితంగా ఇష్టపడతారు. అయితే, ఈ చేప అత్యంత విషపూరితమైనది. దీని కాలేయం, కళ్లు, ఇతర అవయవాల్లో టెట్రొడొటాక్సిన్‌ అనే విషపదార్థం ఉంటుంది. ఇది సైనైడ్‌ కన్నా 1200 రెట్లు అధికంగా ప్రభావం చూపుతుంది. ఈ విషం శరీరంలోకి ప్రవేశించిన క్షణాల్లో మనిషి కండరాల కదలిక ఆగిపోయి, ఊపిరి ఆడక చనిపోతారు.
 
ఇంత ప్రమాదకరమైన ఈ చేపను తినేందుకు జపనీయులు చాలా ఆసక్తి చూపుతారు. దీంతో దీనిని వండేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లను నియమించుకుంటారు. ఈ చేపను గుర్తించడం, కోయడం, శుభ్రం చేయడంలో మూడేళ్లు, వండటంలో కనీసం యేడాది... ఇలా మొత్తం నాలుగేళ్ల శిక్షణ పొందాల్సివుంది. ఆ తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. 
 
అందులో ఉత్తీర్ణులకు మాత్రమే ఈ చేపను వండేందుకు అనుమతి ఇస్తారు. వారిని మాత్రమే రెస్టారెంట్లు చెఫ్‌లుగా నియమించుకుంటాయి. అనుభవం లేకుండా ఫుగు చేపతో వంటకాలు చేస్తే తినేవారికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందట. పైగా జపాన్‌లో ఈ వంటకం చాలా ఖరీదైనది. అందుకే జపాన్‌‌లో ఈ చేప వంటకాన్ని తయారు చేసే రెస్టారెంట్లు కూడా చాలా తక్కువేనట.