ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 24 ఫిబ్రవరి 2024 (20:17 IST)

గ్రూప్-2 అభ్యర్థుల కోసం నాట్స్ ముందడుగు: అవగాహన సదస్సుల్లో ఉచితంగా మెటిరియల్ పంపిణీ

Group-2 candidates
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఇటు తెలుగు నాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు చేయూత నివ్వాలని భావించిన నాట్స్, ప్రభుత్వo నుండి గ్రూప్ -2 నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో, గ్రూప్-2 ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్ధులకు అవసరమైన స్టడీ మెటిరియల్ అందించాలని భావించి, ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా శాసన మండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన అవగాహనా సదస్సులను ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉచితంగా నిర్వహించారు.
 
ఈ క్రమంలో నిరుద్యోగులకు మెటీరీయల్ కూడా ఉచితంగా అందిస్తే అది వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావించిన నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ఆ మెటిరియల్ కోసం నాట్స్ ద్వారా ఆర్ధిక సహకారం అందించారు. సేవాభావంతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చేపట్టిన గ్రూప్-2 అవగాహన సదస్సుల్లో ఉచితంగా నాట్స్ ఈ మెటిరియల్‌ని 30,000 మంది యువతీ, యువకులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని లు గ్రూపు-2 పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
గ్రూప్-2కి పోటీ పడే అభ్యర్ధుల్లో చాలా మంది పేదవారు ఉన్నారని వారికి ఉచిత మెటిరియల్ ఇచ్చి వారికి సాయం చేయాలని అడిగినప్పుడు వెంటనే స్పందించి సహకరించిన నాట్స్ అధ్యక్షుడు బాపు నూతికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో ఉంటున్నా కూడా పుట్టిన ఊరుని, రాష్ట్రాన్ని మరిచిపోకుండా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి బాపు నూతి, నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను లక్ష్మణరావు గారు ప్రశంసించారు.

గ్రూప్-2కి పోటీ పడే అభ్యర్ధులు నాట్స్ అందించే ఉచిత మెటిరియల్‌ ని క్షుణ్ణంగా చదువుకుంటే ఉద్యోగం లభించే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన సూచించారు. ఇప్పటికే నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి/వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, కెరీర్  గైడెన్స్, మహిళా సాధికారత తదితర ప్రజోపకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా నాట్స్ ఇటువంటి సహాయ సహకారాలను అందించాలని కోరారు. గ్రూప్-2 ఉద్యోగం సాధించడానికి అత్యంత కీలకమైన ఈ మెటిరియల్‌ని ఉచితంగా ఇవ్వడంపై అభ్యర్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.