బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Written By DV
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2015 (21:46 IST)

చందమామ అంటే.... చక్రపాణి

ఇప్పటి తరానికి పాతతరం దర్శకులు, నటుల గురించి పెద్దగా తెలీదు. వాటిని తెలియజేసే భాగంలో ఈరోజు చక్రపాణి జయంతి సందర్భంగా ఆయన గురించి కాసేపు....తెలుగు చలన చిత్ర ప్రగతికి ఆద్యులనదగిన వారిలో ఒకరైన నిర్మాత, దర్శకుడు శ్రీ చక్రపాణి గారి వ్యక్తిగత జీవితం గురించి, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విభిన్న శైలి, తత్వాలను గురించి వీక్షకులకు కొంతవరకు తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం!
 
శ్రీ చక్రపాణి గారి అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావు. ఆయన 1908, ఆగస్టు 5 న గుంటూరు జిల్లా తెనాలి, ఐతానగరంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఫిఫ్త్‌ ఫారం తర్వాత జాతీయోద్యమం ఆకర్షించడం వల్ల చదువు మానేసారు. హిందీలో ప్రావీణ్యం ఉండటం వల్ల రచన, అనువాదాలలో అభిరుచి ఏర్పడింది. చిత్రగుప్త, వినోదిని వంటి పత్రికలకు రచనలు పంపేవారు. సుప్రసిద్ధ హిందీ రచయిత వ్రజ నందన శర్మ చక్రపాణి గారి రచనా కౌశలాన్ని గమనించి ''చక్రపాణి '' అనే కలంపేరుతో రాయమని సూచించడంతో అప్పటి నుంచీ ఆ కలం పేరే ఆయన పేరుగా మారిపోయింది.
 
1934లో ఆయన ఆరోగ్యం దెబ్బతిని మదనపల్లి శానిటొరియంలో కొన్ని రోజులు ఉన్నారు. ఆపరేషన్‌ చేసి ఒక ఊపిరితిత్తి తీసివేయడం కూడా జరిగింది. ఇక్కడ పరిచయమైన ఒక బెంగాలీ బాబు దగ్గర ఆయన బెంగాలీ చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత కూడా మరి కొన్ని పుస్తకాలు సహాయంతో బెంగాలీ భాషా కౌశలాన్ని పెంచుకుని శరత్‌ నవలలు చాలావరకూ అనువదించారు.
 
సినిమా రంగ ప్రవేశం: చక్రపాణి మంచి రచయితగా, అనువాదకుడిగా పేరు సంపాదించడంతో 1939 లో సి.పుల్లయ్య గారు ధర్మపత్ని సినిమా తీయదలచి కథ రాయమని చక్రపాణి గారికి కబురు చేసారు. ఈ సినిమా పూర్తవుతుండగానే చక్రపాణి గారి భార్య శ్రీమతి రంగమ్మ మరణించారు. ధర్మపత్ని కథ ఎంతో బాగుండటంతో నిర్మాత బి.ఎన్‌.రెడ్డి గారు కె.వి.రెడ్డి గారితో చక్రపాణి గార్ని సంప్రదించి స్వర్గసీమ చిత్రానికి కథ రాయించదల్చారు. ఆ కథ రాశాక, తెనాలి వెళ్లిపోతానని చక్రపాణి గారంటే తెనాలి వెళ్ళి ఏం చేస్తావు? పుస్తకాలు వేసుకోడమే కదా, ఇక్కడుంటే బి.ఎన్‌.కె ప్రెస్‌‌లో వేసుకోవచ్చు అన్నారు బి.ఎన్‌.రెడ్డి గారు. అక్కడితో చక్రపాణి గారి మద్రాసు జీవితం ప్రారంభమైంది.
 
నాగిరెడ్డితో చక్రపాణి
బి.ఎన్‌.కె ప్రెస్‌లో యువ ప్రచురణలు వేస్తున్న సమయంలోనే ఆ ప్రెస్‌ యజమాని బి.నాగిరెడ్డి గారితో పరిచయం ఏర్పడి, అనతి కాలంలోనే స్నేహంగా మారింది. వారిద్దరూ కలసి 1945లో ప్రారంభించిన ఆంధ్రజ్యోతి, 1947 జులైలో ప్రారంభించిన చందమామ జయప్రదం అయ్యాయి. నాగిరెడ్డి, చక్రపాణిల పేర్లు తెలుగు దేశమంతా మార్మోగాయి.
 
1949లో నాగిరెడ్డి గారు వాహినీ స్టూడియోని లీజుకు తీసుకుని, పక్కనున్న స్థలం కూడా కొని విజయా స్టూడియోగా తీర్చి దిద్దారు. స్టూడియో సిద్ధం కాగానే సినిమాలు తీయాలని నిర్ణయించడంతో, పూర్తి పల్లెటూరు వాతావరణంతో షావుకారు కథ రూపొందించారు చక్రపాణి. ఈ సినిమాకు అవసరమైన చర్నాకోల, ఉక్కడం గోతాలు, గంటలు మొదలైనవి ఐతానగరం నుంచి తీసుకువెళ్లారట.
 
షావుకారు చిత్రం విడుదలై ఎంతో పేరు తెచ్చుకోవడంతో, తదుపరి పాతాళభైరవి సినిమా తీశారు. ఆ చిత్రానికి అసాధారణ ఆర్థిక విజయం దక్కడంతో నిలదొక్కుకుని పెళ్ళి చేసి చూడు, మిస్సమ్మ చిత్రాలు తీశారు. ఈ రెండు సినిమాలూ విజయవంతమై నాగిరెడ్డి, చక్రపాణి గారలకు ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. తన చిత్రం విడుదలైన వారానికే పరాజయం పొందితే ''నూర్రోజులు ఆడిన చిత్రం అని పోస్టరు వేసి కింద (టాగ్‌ లైన్‌ లాగా) చిన్న అక్షరాలతో 93 రోజుల క్రితం విడుదలై ఉంటే '' అని రాయించి పరాజయాన్ని ఆనందంగా అంకీగరించిన వ్యక్తి ఆయన.
 
చిత్ర విజయానికి ఆయనకు కొన్ని కొలమానాలు ఉండేవి. చిన్న పిల్లలకు సినిమా నచ్చితే పెద్దవాళ్ళకూ తప్పకుండా నచ్చుతుందని ఆయన విశ్వాసం! గుండమ్మ కథ చిత్రం మొదటి సెట్టు పూర్తి కాగానే నాగిరెడ్డి, ఇతర తెలిసిన కుటుంబాల పిల్లకు 150 మందిని పోగేసి ఆ సెట్టు వేసి చూపించారు. రామారావును సగం నిక్కరుతో చూసి పిల్లలంతా కేరింతలు కొట్టారు. ఇది హిట్టేనయ్యా అని రామారావు గారితో ఆ రోజే చెప్పారట. ఆడియన్సు ని ఏడిపిస్తే నిర్మాత ఏడవ వలసి వస్తుంది ఇదీ చక్రపాణి గారి ఉవాచ!
 
అలాగే గుండెలు బాదుకుని ఏడ్చే ఏడుపుల మీద గానీ, సినిమా పరిభాష లోని మెలోడ్రామా మీద గానీ ఆయనకు నమ్మకం లేదు. తీవ్రమైన సంఘటనల్లో కూడా సునిశితమైన హాస్యం లేకుండా ఆయన కల్పన ఉండేది కాదు. డి.వి. నరసరాజు గారు గుండమ్మ కథ సినిమాలో గుండమ్మకు భర్త ఉంటే బాగుండన్న ఉద్దేశంతో స్క్రిప్టు రాసుకున్నారు. తీరా చివర్లో స్క్రిప్టు చూసిన చక్రపాణి ''గుండమ్మకు మొగుడా! వాడెందుకు దండగ కథకు అడ్డం పడుతూ! వాడిని పీకేసెయ్యండి'' అన్నారు. నిజంగానే ఆ పాత్ర లోపం లేకుండానే జనం ఆ సినిమాని ఎంజాయ్‌ చేశారు. ఇలా ఖచ్చితంగా ఉండేవి చక్రపాణి గారి కాలిక్యులేషన్లు!
 
మొహమాటం లేకుండా ఉండటం, ఖచ్చితంగా వ్యవహరించడం కూడా ఆయన అలవాట్లు. మిస్సమ్మ సినిమా కోసం మిస్సమ్మ పాత్రకి ముందు భానుమతి గారిని బుక్‌ చేసుకున్నాక తర్వాత, ఆమెతో చిన్న పేచీ రావడంతో, (అప్పుడు భానుమతి గారు చాలా పెద్దస్థాయి నటి) నిర్మొహమాటంగా ఆమెను తొలగించి చిన్న చిన్న పాత్రలు వేస్తున్న సావిత్రిని తీసుకున్నారు ఆ పాత్రకి.
 
చిత్రంలోని ప్రతి శాఖనూ చాలా ప్రత్యేక శ్రద్ధతో గమనించడం, జనాన్ని రంజింపజేసేలా తీర్చి దిద్దడం చక్రపాణి గారి ప్రకృతి. పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రజలని ఆకట్టుకునేలా ఉండాలని మెలొడీకి ప్రాధాన్యం ఇచ్చేలా సంగీత దర్శకుడితో, రచయితతో చర్చించి, సూచనలిచ్చి పాటల రూపకల్పన ఉండేలా చూసేవారు. అందుకే విజయా వారి పాటలు ఈనాటికీ సంగీత ప్రియుల గుండెల్లో, భద్రంగా ఉన్నాయి. పసుమర్తి కృష్ణ మూర్తి లాంటి నృత్య దర్శకుడికి కూడా ''ఏందదీ, ఆ కాలు ఇలా తిప్పితే పోలా? బాగుంటది'' అని సలహాలిచ్చేవారు.
 
శ్రీ నాగిరెడ్డితో కలిసి విజయా ప్రొడక్షన్స్‌ ద్వారా షావుకారు, పాతాళభైరవి, మాయాబజార్‌, గుండమ్మ కథ, సి.ఐ.డి, గంగ మంగ అప్పు చేసి పప్పు కూడు,పెళ్ళి చేసి చూడు,మిస్సమ్మ వంటి మరపురాని చిత్రాలను నిర్మించారు చక్రపాణి. సి.పుల్లయ్య గారి ధర్మపత్ని చిత్రానికి, బి.ఎన్‌.రెడ్డి గారి స్వర్గ సీమ చిత్రానికి కథలను అందించారు.
 
రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా తన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను తెలుగు ప్రజలకు రుచి చూపించి, ''చేతికందిన చందమామ''గా పిల్లల హృదయాలలో సైతం చోటు సంపాదించిన శ్రీ చక్రపాణి 1975లో మరణించారు.