శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (19:53 IST)

రామునికి అగస్త్యుడు ఉపదేశించిన "ఆదిత్య హృదయం" స్తోత్రము.. రథసప్తమి రోజున? (video)

"ఆదిత్య హృదయం" స్తోత్రమును శ్రీ రామచంద్రునకు అగస్త్య మహర్షి ఉపదేశించినది. ఈ స్తోత్రాన్ని రోజూ సూర్య నమస్కారం చేస్తూ.. మూడుసార్లు పఠిస్తే అనారోగ్యాలు, ఈతిబాధలుండవు. విజయాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
"రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్| 
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం||
 
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః|
జ్యోరిర్గణానాం పతయే దినాధిపతయే నమః||
 
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫల్మేవచ|
యానికృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభః||
 
విజయ లబ్ధికై ఈ స్తోత్ర పారాయణము ఉపకరిస్తుందని పండితుల వాక్కు. రామాయణంలో రాముడిని కార్యోన్ముఖుడిని చేసేందుకు ఆదిత్య హృదయాన్ని సప్త రుషుల్లో ఒకరైన అగస్త్యుడు ఉపదేశించారు. రామాయణంలోని యుద్ధకాండ. లంకలోకి అడుగుపెట్టిన రాముని ఎదుర్కొనేందుకు, రావణుడు భీకరమైన రాక్షసులందరినీ యుద్ధభూమికి పంపాడు. అలా తన మీదకు వచ్చినవారిని వచ్చినట్లుగా సంహరిస్తున్నాడు రాముడు. 
 
ఒకపక్క వారితో యుద్ధం చేస్తున్న ఆయన శరీరం అలసిపోతోంది. అంతకుమించి తన కళ్లెదుట జరుగుతున్న మారణహోమాన్ని చూసి మనసు చలించిపోతోంది. దాంతో యుద్ధం పట్ల విముఖత మొదలైంది. దీన్ని గమనించిన అగస్త్య మహాముని.. ఆదిత్యునిని ప్రార్థించమని చెప్తారు. ఆయనను ప్రార్థిస్తే ఎనలేని శక్తి లభిస్తుందని.. అంతులేని విజయాలు పొందవచ్చునని సూచిస్తాడు. అలా చెప్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని లోకానికి అందించారు.. అగస్త్య ముని. 
 
ఈ ఆదిత్య హృదయంలో 30 శ్లోకాలుంటాయి. మొదటి ఆరు శ్లోకాలు ఆదిత్య పూజ కోసం. ఏడో శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు ఆదిత్య ప్రశస్తి వుంటుంది. 15వ శ్లోకం నుంచి 21 వరకు ఆదిత్యుని ప్రార్థన, 22వ శ్లోకం నుంచి 27వరకు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే కలిగే శుభాల గురించి వర్ణన వుంటుంది. ఇదంతా విన్న రాముల వారు కార్యోన్ముఖులు కావడాన్ని 29,30 శ్లోకాల ద్వారా గమనించవచ్చు. 
 
రాముల వారికే విజయాన్ని, శుభాన్ని ఇచ్చిన ఈ ఆదిత్య హృదయాన్ని రోజువారీగా పఠించిన వారికి విశేష ఫలితాలుంటాయి. అందుకే జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా, అనారోగ్యాలు ఏర్పడినా... ఎలాంటి ఒడిదొడుకులలోనైనా ఆదిత్య హృదయం మనల్ని ఒడ్డుకి చేరుస్తుంది. శత్రువినాశనం కావాలన్నా, దారిద్ర్యం దూరమవ్వాలన్నా, మనోవాంఛలు తీరాలన్నా ఆదిత్య హృదయం తారకమంత్రంలా పనిచేస్తుంది.
 
మూడుసార్లు కనుక ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఈ సంగ్రామంలో విజయం సాధిస్తావు.. అంటూ సాక్షాత్తూ అగస్త్య మహర్షే 26వ శ్లోకంలో పేర్కొంటారు. కాబట్టి అవసరాన్నీ, అవకాశాన్నీ బట్టి ఎన్నిసార్లయినా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. ముఖ్యంగా సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్యునికి అభిముఖంగా నిలిచి ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇంకా ఫిబ్రవరి 1వ తేదీన వచ్చే రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో ఈ మంత్రాన్ని పఠించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి.