శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:45 IST)

అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం కాదు.. చెట్లను నాటితే?

అక్షయ తృతీయ ఈ నెల 26వ తేదీ ఆదివారం వస్తోంది. అక్షయ తృతీయ నాడు కోరిన కోరికలు నెరవేరాలంటే.. సంబా గోధుమను బాగా ఉడికించి జావగా లేదంటే పొంగలిగా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలనిస్తుంది. కుబేర లక్ష్మి, లక్ష్మీ నారాయణ, లక్ష్మీ నరసింహస్వామిని ఆ రోజున పూజించి.. గోధుమతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించవచ్చు. పానకం, వడపప్పు, మామిడిపళ్లు శ్రీ మహా విష్ణువుకి నివేదించడం మంచిది.
 
ప్రత్యేకంగా శ్రీమహాలక్ష్మిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. అక్షయ తృతీయ వ్రతాన్ని చేసుకునేవారు ఉప్పును మానేసి పంచదార కలిపిన పేలపిండిని తీసుకోవచ్చు. అక్షయ తృతీయ నాడు తులసి ఆకులతో విష్ణుసహస్రనామ పారాయణ చేయడంతో అనంత పుణ్యఫలం లభిస్తుంది. గోధుమలు దానం చేస్తే ఇంద్రుడి అనుగ్రహంతో సకలసంపదలు చేకూరుతాయి. అన్నాదులకు లోటు కలుగదు. 
 
అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జననం జరిగింది. గంగమ్మ ఆవిర్భవించింది. త్రేతాయుగం ప్రారంభమైంది ఈ రోజునే. అక్షయ తృతీయనాడే వ్యాసమహర్షి మహాభారతాన్ని రచనను ప్రారంభించారు. ఈ రోజునే అన్నపూర్ణమ్మ అవతరించిన రోజు.
 
అక్షయ తృతీయ పవిత్ర దినానే కుబేరుడు శివానుగ్రహాన్ని పొంది మహాలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షుడిగా నియమింపబడ్డాడు.శ్రీకృష్ణుడు ద్రౌపదిని దుశ్శాసనుడి నుండి కాపాడిన గొప్ప ఘడియ ఈ రోజే. తన బాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగించి అపార సంపదను శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. 
 
ముఖ్యంగా సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో పాండవులకు అక్షయపాత్రను ఇచ్చిన రోజు ఇదే. ఆది శంకరుల వారు ఓ పేద వృద్ధజంట లబ్ధి కోసం సృష్టిలో తొలిసారి కనకధారాస్థవం స్తుతించిన రోజు. అలాంటి ఈ పవిత్రమైన రోజున కంచుగిన్నెలో నీటిని పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, తులసి, వక్క, దక్షిణతో సహా దానమిస్తే గయలో శ్రాద్ధం పెట్టిన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కావాలనుకునేవారు, పితృశాపాలు ఉన్నవారు ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనడం కంటే.. చెట్లని నాటడం అనంత ఫలాన్నిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.