గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జులై 2024 (16:12 IST)

ప్రదోషం.. శివాలయంలో ఒక్క దీపం వెలిగిస్తే.. కోటి రెట్ల ఫలితం

Lord shiva
ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థం. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశం ఉంది. శనివారం త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని "మహా ప్రదోషం" అంటారు. ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్థనారీశ్వరునిగా అతిప్రసన్నుడై దర్శనమిస్తాడు. పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. 
 
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిస్తాడు. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో, హిమాలయాలలో, నాట్యం చేస్తూ ఉంటాడు. 
 
ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. 
 
ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. 
 
సాయంత్రం ఈ పూజ జరుగుతుంది. శివలింగానికి పాలు, పెరుగు మొదలుగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. తరువాత బిల్వదళాలతో పూజ చేస్తారు. ప్రదోష కాలంలో బిల్వదళాలతో  శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. తరువాత ప్రదోష వ్రత కథ, శివ పురాణం శ్రవణం చేస్తారు. 
shiva
shiva
 
ఇంకా మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తారు. ప్రదోషం రోజు శివాలయంలో ఒక దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం ఉంటుంది. స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు మహా శివుడు మంచి ఆనందకర జీవితం ప్రసాదిస్తాడు. ప్రదోషం వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. అపవాదులు దూరమవుతాయి. వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది. సంతాన సాఫల్యం కలుగుతుంది. చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది.