బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 జులై 2024 (16:35 IST)

దక్షిణాయనంలో దానాలు.. ఆ దేవతలను ప్రతిష్టించవచ్చు..

దక్షిణాయనంలో కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్యస్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. అలాగే దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.
 
కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. 
 
ఈ కాలంలో కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.
 
సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి.
 
ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు  పితృ దేవతలకు ఉత్తమమైనవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.