ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (11:24 IST)

శ్రావణ పౌర్ణమి.. హయగ్రీవ జయంతి.. యాలకుల మాల సమర్పిస్తే..?

Hayagreeva
శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. రాఖీ పండుగ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. హయగ్రీవుడు విష్ణు అవతారంగా భావిస్తారు. హయగ్రీవుడిని జ్ఞానానికి, వివేకానికి, వాక్కుకు, బుద్ధికి, విద్యకు అధిదేవతగా భావిస్తారు. 
 
హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి. ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది.
 
గుర్రపుతల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్వామి అవతరించిన రోజు. 
 
విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. అతనిని లేపేందుకు దేవతలు ఓ కీటకాన్ని పంపుతారు. కానీ ఆ కీటకం కొరకడంతో దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. 
 
అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది.
 
అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. అందుకే హయగ్రీవ జయంతి రోజున ఆయనకు యాలకులతో మాల సమర్పిస్తే.. ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు వరిస్తాయి. వేదాలకు రక్షకుడైన హయగ్రీవుని పూజతో గొప్ప విద్యావకాశాలు చేకూరుతాయి. ఈ రోజున గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా తెల్లని పువ్వులతో ఆయనను పూజిస్తే.. జ్ఞానం సంప్రాప్తిస్తుంది. 
 
అందుకే హయగ్రీవ జయంతి రోజున ఈ మంత్రాన్ని పఠించాలి.. 
 
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం 
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః
 
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్
 
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః 
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః
 
ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం