శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే...
జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషంగా సాగాలంటే లక్ష్మీకటాక్షం ఉండాలి. లక్ష్మీదేవి విశేష అనుగ్రహం పొందాలంటే ప్రతి మంగళ, శుక్ర వారాలలో లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు.
శ్రావణ శుక్రవారం మహిళలు అమ్మవారిని పూజించడం వల్ల సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ముత్తైదువులను పిలిచి, తరతమభేదాలు విడిచి ప్రతి స్త్రీమూర్తిలోనూ లక్ష్మీదేవిని దర్శించి, ఇంటికి ఆహ్వానించి తాంబూలం సమర్పించాలి.
శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి అష్టోత్తరం, లలితా సహస్రనామాలు మనస్పూర్తిగా చదవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. శ్రావణ శుక్రవారం ఆలయ దర్శనం చేసుకుంటే అమ్మవారి అభయం పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది.
అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము. లక్ష్మీదేవికి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మంది ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా పసుపు, కుంకుమ, చందనం, ఎరుపురంగు జాకెట్ ముక్క, దక్షిణ కానుకగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు విజయవంతమై మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.