1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జులై 2020 (17:53 IST)

ఆషాఢ అమావాస్య.. పితృదేవతలకు తర్పణాలిస్తే.. ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?

అమావాస్య రోజుల్లో పుణ్యతీర్థాల్లో స్నానమాచరించే వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే పితృదేవతలకు తర్పణం వదలడం, పితృపూజలు చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఆషాఢంలో వచ్చే అమావాస్య రోజున గంగానదిలో స్నానమాచరించి.. పితృ తర్పణాలు వదలడం శుభఫలితాలనిస్తుంది. 
 
ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున మూడు సముద్రాలు కలిసే చోట కన్యాకుమారి, ధనుష్కోటి, రామేశ్వరం అగ్ని తీర్థంలో స్నానమాచరిస్తే.. పితృదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. వేదారణ్యం, గోకర్ణం వంటి ప్రాంతాల్లో అమావాస్య రోజున స్నానమాచరించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలా కాకుంటే సముద్ర స్నానమైనా చేయాలి. అలాగే ఆషాఢ అమావాస్య రోజున ఇంట పూజలు చేస్తే పితరుల ఆశీర్వాదం లభిస్తుంది. 
 
దక్షిణాయనంలో వచ్చే అమావాస్య కావడంతో పుణ్యతీర్థాల్లో పితృ పూజలు చేయడం.. బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం వంటివి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. చాతుర్మాస దీక్షలుండే వారు ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగించుకోవచ్చునని విశ్వాసం. అలాగే ఆషాఢ అమావాస్య పూజతో ఇంట వుండే దుష్టశక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.