శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (23:18 IST)

మంగళవారం.. సుందరకాండ పారాయణం చేస్తే.. ఎంత మేలంటే?

రామాయణంలోని సుందరకాండను మంగళవారం పూట పారాయణం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా కార్యజయం, చదువులో అత్యున్నత స్థానానికి ఎదగాలనుకునేవారు, వివాహం కానివారు, సంతాన ప్రాప్తి, నవగ్రహదోషాలు, అనారోగ్య సమ్యలు, ఆర్థిక బాధలు, ఈతి బాధలు, కుటుంబ సమస్యలు, ఇలా రకరకాల సమస్యలకు సుందరకాండ పరమౌషధం అని పండితుల అభిప్రాయం. పారాయణం చేయించుకోవడం ఇబ్బంది ఉంటే సుందరకాండ పుస్తకాన్ని కొనుక్కొని ప్రతీరోజు ఒక పుష్పం దానిపై ఉంచి ప్రార్థన చేసినా మీకు తప్పక మంచి జరుగుతుందని శాస్త్రవచనం. 
 
సుందర కాండలో హనుమంతుడే కథానాయకుడు. రామాయణంలోని ప్రతికాండలోనూ శ్రీరాముని ప్రత్యక్ష దర్శనం ఉంటుంది. ఇందులో చివర్లో మాత్రమే రామచంద్రుడు కనిపిస్తాడు. కానీ కథంతా శ్రీరామ కార్యసాధనతో ముడిపడి ఉంటుంది. సీతాన్వేషణ నిమిత్తం బయల్దేరిన వానర వీరుల్లో దక్షిణ దిశగా పయనించిన అంగద, జాంబవంత, హనుమంతాది మహావీరులు కార్యసాధన చేసుకొని తిరిగి రాగలరన్న విశ్వాసం రామునిలో పుష్కలంగా ఉంది. 
 
ముఖ్యంగా హనుమంతునిపై మరింత నమ్మకముంది గనుకనే అంగుళీయకం హనుమకే ఇచ్చాడు. స్వామి కార్యనిర్వహణ ఎంత దుస్తరమైనదైనా ఫలవంతం చెయ్యాలన్న పట్టుదల ఉండాలన్నది హనుమంతుని ద్వారా రామాయణం మనకు చెబుతున్నది. అలాగే.. తాను ఎవరి పక్షాన వచ్చాడో అతని శక్తి ఎంతటిదో చెప్పి శత్రువును హెచ్చరించే స్థాయిని ఈ కాండలోనే మనం చూడగలం. 
 
చంపదలచి తోకకు నిప్పంటించినప్పుడు అదే నిప్పుతో లంకా దహనం చేసి తమ విజయం తథ్యమన్న సంకేతాన్నివ్వడమే గాక, రామాయణంలోని ముఖ్య ఘట్టమైన రావణ వధ, రాక్షస వినాశనం కూడా జరిగి తీరుతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పిన కార్యశీలి హనుమంతుడు. మహా కార్యనిర్వహణ చేయడం గురించి అడుగడుగునా తెలిపే సుందరకాండం నిత్యపారాయణ యోగ్యమనడంలో ఎటువంటి సందేహమూ లేదు.