గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (10:35 IST)

ఉత్థాన ద్వాదశి నాడు తులసీమాతకు వివాహం జరిపిస్తే..? (Video)

శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి మరుసటి రోజు అంటే ఉత్థాన ద్వాదశి నాడు (నవంబర్ 26, గురువారం) తులసి, విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పూరాణాలు చెప్తున్నాయి. కనుక ఈ రోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణుస్వ రూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కల్యాణం జరిపిస్తారు. కొందరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతారు. 
 
పురాణ కథనాన్ని అనుసరించి తులసి కల్యాణం కథ ఇలా సాగుతుంది. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్ళి చేసుకోవాలని కలలుకంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుండటాన్ని సహజంగానే ఆమెకి తులసి మీద మహా కోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకుపడి తులసిని ''నువ్వు మొక్కగా మారిపో'' అని శపించింది. 
 
అయితే తనపట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక మొక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో తులసీ బాధపడకు భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నేను సాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరౌతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్ళలో దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్ళలో తులసిమొక్కను నాటుకుని పూజిస్తారు. నీకు నీళ్ళు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. 
 
కార్తీక శుక్ల ద్వాదశి నాడు నీతో నాకు కల్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. ఆ విధంగా తులసిమొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. తులసిమొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. 
 
ఇంకా ''యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా | 
యథాగ్రే సర్వ వేదశ్చ తులసీ త్వం నామం మధ్యం ||" అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి వనాన్ని భక్తిగా పూజించాలి. 365 వత్తులను తులసి కోట దగ్గర వెలిగిస్తారు. బెల్లంతో చేసిన పరమాన్నం వండి నైవేద్య నివేదన చేయాలి. కార్తీక శుక్ల ద్వాదశి లేదా ఉత్థాన ద్వాదశి నాడు విష్ణుమూర్తితో తులసిమొక్కకు కల్యాణం జరిపించి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం ఆచారంగా కొనసాగుతోంది.