శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (21:03 IST)

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

Lord Shiva
మనం కనే కలలు మన ప్రస్తుత జీవితానికి లేదా భవిష్యత్తుకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయని చెబుతారు. ప్రతి కలకి అర్థం ఉంటుంది. దేవుళ్ళు లేదా దేవాలయాలకు సంబంధించిన కలలు ఇతర కలల కంటే ఎక్కువ శుభప్రదంగా భావిస్తారు.
 
దేవతలు కలలో కనిపించడం చాలా శుభప్రదం. ఇది అందరికీ జరగదు. దేవుడి గురించి కలలు వస్తే, ముఖ్యంగా అవి తరచుగా వస్తుంటే, చాలా అదృష్టవంతులు. కలలో దేవుడిని చూడటం అంటే వారి అనుగ్రహం లభించినట్లే. అలాగే మహాదేవుడైన శివుని గురించి కలలు కంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
 
మీరు శివుడిని లేదా శివుడికి సంబంధించిన వస్తువులను, శివాలయాన్ని లేదా శివ చిహ్నాలను కలలో చూసినట్లయితే, శివుని దయ వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు జరగబోతోందని అర్థం. అంటే మీ జీవితంలోని సమస్యలు మాయమై, మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుందని అర్థం. 
 
మీకు తరచుగా శివునికి సంబంధించిన కలలు వస్తుంటే, మీరు శివుని పరిపూర్ణ ఆశీర్వాదాలను పొందారని,  జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారని అర్థం. కలలో శివాలయం చూడటం అంటే మీ జీవితంలోని బాధలు తొలగిపోబోతున్నాయని.. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
కలలో శివలింగం కనిపించడం చాలా శుభప్రదం. శివలింగాన్ని కలలో చూసినట్లైతే.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇంకా ప్రతిరోజూ శివుడిని ధ్యానించడం మంచిది. కలలో శివలింగాన్ని చూడటం విజయానికి సంకేతంగా పరిగణించబడుతుంది.
 
కలలో శివపార్వతులు కలిసి కనిపిస్తే.. కొత్త అవకాశాలు లభిస్తాయని అర్థం చేసుకోవాలి. తద్వారా ఆదాయం, సుఖసంతోషాలతో కూడిన జీవితం గడుపుతారు. శివుడు తాండవ నృత్యం చేస్తున్నట్లు లేదా నటరాజ రూపంలో ఉన్నట్లు.. కలగన్నట్లైతే.. సంపదలు లభిస్తాయని విశ్వాసం. శివుని త్రిశూలం కూడా మూడు యుగాలను సూచిస్తుంది. మీ కలలో దాన్ని చూడటం అంటే మీ గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి మీరు అనేక సత్యాలను అర్థం చేసుకోబోతున్నారని అర్థం.
 
శివుని తలపై చంద్రవంక ఉన్నట్లు కలలో కనిపిస్తే, జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థం. శివుని తల నుండి గంగా జలం ప్రవహిస్తున్నట్లు కలలుగన్నట్లయితే, మీ ఆత్మ శుద్ధి చేయబడి, అపరిమితమైన జ్ఞానం, సంపద, ప్రేమను పొందుతారని అర్థం.