కష్టాలను తొలగించుకొండిలా...
కొందరు ప్రతి నిత్యం సమస్యలతో బాధపడుతుంటారు. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో సతమతమయ్యే వారి శాతం నూటికి తొంభై శాతంవుంటారని నిపుణులు అంటున్నారు. పిల్లల ఆరోగ్యం, చదువులు, పరీక్షలు, ఫీజులు ఇంకా ఇతరత్రా బాధలు ప్రతి తల్లిదండ్రులకూ వుంటాయి.
వీటితో పాటు ప్రధానమైంది డబ్బు.. డబ్బు.. డబ్బు. ఈ డబ్బుది కూడా సమస్యే. డబ్బుతోనే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఇతరులు తమ ప్రవర్తన, మాటల ద్వారా ఇబ్బందులకు గురి చేయడం వంటివి కూడా సమస్యలే. ఈ సమస్యలన్నిటినీ కూడా సునాయాసంగా పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యపరంగా లేదా ఆర్థికంగా సమస్యలతో సతమతమవుతున్న వారి శరీర ప్రక్రియపై ప్రభావం పడుతుందని, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శరీరప్రక్రియ సక్రమంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బాధ నుంచి విముక్తిపొందగల్గుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిగో మీ కోసం కొన్ని చిట్కాలు...
మీ ఆలోచనలను వ్యతిరేకించే వారికి మీరు దూరంగా వుండాలి. అలాంటి వారిని సలహాలు, సహాయం అడగవద్దు. వీలైనంతవరకు సమస్యలను బాధలను తగ్గించుకోండి. నిత్యం బిజీగావుండడానికి ప్రయత్నించాలి. అనవసర విషయాల గురించి ఆలోచించడం తగ్గించాలి. దీంతో అనవసరమైన బాధలు తగ్గుతాయి.
మిమ్మల్ని సమస్యలలోకి నెట్టే ఆలోచనలను మీ కలలోకి కూడా రానీవ్వకూడదు. గతంలో మంచి జరిగినా, చెడు జరిగినా వర్తమానంలో దాని గురించి ఆలోచించడం అనవసరం. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలే కానీ అదేపనిగా వాటిని గుర్తుకుతెచ్చుకుంటూ బాధపడకూడదని పెద్దలు చెపుతుంటారు. మీరు చేస్తున్న పని గురించి ప్రతిఫలం ఆశించడం తప్పుకాదు. కానీ ఆ లాభమేదో వెంటనే వచ్చేయాలని మాత్రం అనుకోకూడదు. మీరు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. కానీ కాస్త ఆలస్యంగానైనా వస్తుంది.
ముఖ్యంగా మనిషికి గాఢమైన నిద్ర చాలా సమస్యలను దూరం చేస్తుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్ర అవసరమని వైద్యులు తెలిపారు. నిద్ర సహజంగా రావాలే కానీ దానికోసం ప్రత్యేకంగా మందులు వాడకూడదు. నేను సంతోషంగావున్నానన్న ఫీలింగ్ మిమ్మల్ని ఆనందంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. సమస్యల గురించి ఆలోచించడం మానుకోవడం మంచిది. ఉదయం లేవగానే ప్రతిరోజు వ్యాయామం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతో మంచి ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతత కూడా చోటుచేసుకుంటుంది. దీంతో ఎన్నో సమస్యలు పరిష్కారమౌతాయి.