విష్ణుమూర్తి కుడిచేతిలోని సుదర్శన చక్రం విశిష్టత తెలుసా? (video)

సిహెచ్| Last Updated: శుక్రవారం, 10 జులై 2020 (17:52 IST)
శ్రీమన్నారాయణుని దివ్య ఆయుధాలలో ప్రముఖమైన సుదర్శన చక్రాన్ని శ్రీచక్రత్తాళ్వారుగా కీర్తిస్తారు. తిరుమలలో చక్రత్తాళ్వారును సహస్రదీపాలంకార మంటపం వద్ద శ్రీవారి తూర్పు ప్రాకారంపై దర్శించవచ్చు. శ్రీచక్ర పెరుమాళ్‌ను శ్రీమహావిష్ణువు అవతారంగా కూడా పేర్కొంటారు.

శ్రీమన్నారాయణుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంస్థాపన కార్యాలకు ఉపయోగించే చక్రాయుధమే సుదర్శనచక్రం. విష్ణుమూర్తి పంచాయుధాలలో ఈ సుదర్శన చక్రానికి ఎంతో విశిష్టత వుంది. భక్తుల కోరికలు నెరవేర్చడానికి, కష్టాలు కడతేర్చడానికి, సమస్యలు పరిష్కరించడానికి ధర్మయుద్ధంలో శత్రువుల వినాశానానికి, పాపాలను పటాపంచలు చేయడానికి భగవంతుడు సుదర్శనచక్రాన్ని వినియోగిస్తాడని అనేక శాస్త్ర గ్రంధాలు పేర్కొన్నాయి.

సుదర్శన చక్రం ఆవిర్భావానికి సంబంధించి శ్రీవిష్ణుపురాణం ఆధారంగా ఓ కథ వుంది. దీని ప్రకారం సూర్యుని భార్య విశ్వకర్మను ప్రార్థించింది. దీనితో సూర్య తేజస్సు తగ్గించేవిధంగా విశ్వకర్మ ఓ వస్తువును తయారుచేసి సూర్యుని యంత్రంలో సానబట్టగా రాలిన చూర్ణతో తయారైనదే సుదర్శన చక్రమని తెలుపబడింది.

మరో కథనం ప్రకారం పరమేశ్వరుడు విష్ణువు తనను ధ్యానించడంతో మెచ్చి తన తేజస్సును ఇతర దేవతల తేజస్సును రంగరించి సుదర్శనాన్ని సృష్టించి భగవంతుడైన శ్రీమన్నారాయణునికి సమర్పించాడని వామన పురాణంలో వుంది. సుదర్శన చక్రాన్ని ఆయుధంగానే కాక, అలంకారంగా కూడా అనేకమంది ప్రస్తుతిస్తారు.

సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి అనేక సందర్భాల్లో ఉపయోగించినట్లు దృష్టాంతాలున్నాయి. గజేంద్రమోక్షం, శిశుపాలవధ తదితర ఉదంతాలు సుదర్శన చక్రమహిమను లోకానికి చాటిచెప్పాయి. శత్రు సంహారం తర్వాత తిరిగి భగవానుని కుడి చేతిలో నిక్షిప్తం అవుతుంది.

దీనిపై మరింత చదవండి :