గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 15 జులై 2020 (21:47 IST)

కత్తితో ఆడుకుంటున్న పిల్లవాడి చేతి నుండి దాన్ని తీసేయాలంటే?

మానవునికి లక్ష్యసాధన చేయడంలో ఆరు రకాల అవరోధాలుంటాయి. అవి ఒకటి అత్యాహారం, రెండవది అనవసర ప్రయాస, మూడవది వ్యర్థ సంభాషణ చేయడం, నాలుగవది నియమాలను మొక్కుబడిగా పాటించడం, ఐదవది దుష్ట జనసాంగత్యం, ఆరోది అత్యాశ. ఈ ఆరు అంశాలు లక్ష్యసాధనలో పెద్ద అవరోధాలు. 
 
ఈ అవరోధాలను అతిశులభంగా దాటాలంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 'పరం దృష్ట్వా నివర్తతే' అనే మాటను ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. అదే ఎప్పుడైతే మనిషి ఉన్నత విషయాల అనుభూతిని పొందుతాడో అప్పుడు అల్ప విషయాల నుండి బయటపడతాడు.
 
అందుకే విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో కొద్దికొద్దిగా విజయాలను సాధించడం మొదలుపెడితే అతిశులభంగా ఆరు అవరోధాల నుండి బయటపడతారు. కత్తితో ఆడుకుంటున్న పిల్లవాడి చేతి నుండి దాన్ని తీసేయాలంటే వాడి చేతికి వేరే వస్తువును ఇవ్వాలి. అది ఆ పిల్లవాడికి కత్తి కంటే ఎక్కువ నచ్చినదై వుండాలి. ఇదే పరం దృష్ట్వా నివర్తతే.
 
అందుకే ఈ మాటను విద్యార్థినీవిద్యార్థులు పదేపదే ఉచ్ఛరిస్తూ వుండాలి. అలాగే ఓ కాగితం మీద దాన్ని రాసుకుని తాము చదువుకునే ప్రదేశంలో గోడకు అంటించుకోవాలి. ఎవరెస్టు పర్వతాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ తన ఇంట్లోని ప్రతీగదిలో ఎవరెస్టు చిత్రాన్నే పెట్టుకుని, దానినే చూస్తుండేవాడని చెపుతారు. ప్రతి విద్యార్థి చిన్నచిన్న కోరికల మీదకు మళ్లకుండా తన లక్ష్యం మీదే ప్రాణాలుంచితే నిశ్చయంగా విజయాలు సాధిస్తాడు. అతడు పరం దృష్ట్వా నివర్తతే అన్న మాటను తప్పకుండా పాటించడమే అతని విజయాలకు ముఖ్యకారణం.