Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవం చేస్తాడని ప్రతీతి. ఈ సమయంలో ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం గానీ, పూజలు చేస్తే మంచిదని పెద్దల మాట. ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుందనీ, నెయ్యితో అభిషేకిస్తే మోక్షం లభిస్తుందనీ, గంధంతో అభిషేకం చేస్తే లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం సౌమ్య ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.
సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. ఇంకా ప్రదోష ఆలయంలో బ్రాహ్మణులకు పెసలు, ఆకు పచ్చ రంగు వస్త్రాలు దానం ఇస్తే మంచిది. విశేషంగా ఈ రోజు వినాయకునికి గరిక సమర్పించడం కూడా ఎంతో మంచిది.