ఆదివారం, 28 సెప్టెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (21:34 IST)

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: షట్చక్రములు చూచుటకై కక్కయ్య తన భార్యను ముక్కలు చేయుట

Sri Veerabrahmendra Swamy
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు ఒకరోజు నిత్యానుష్ఠానములు నిర్వహించుకున్న తరువాత ఎదురుగా భక్తి శ్రద్ధలతో వేచి ఉన్న సిద్దయ్య, తక్కిన భక్తులకు సృష్ఠి ఆవిర్భావ రహస్యము, జీవులలోని సత్వరజస్తమోగుణముల వివరణ బోధించిన తరువాత షడ్చక్రములు గూర్చి వివరించనారంభించారు. చిదానంద స్వరూపమైనట్టిది, సర్వమూ తానైనట్టిదీ, అయిన బ్రహ్మము జ్ఞానులైన వారికి ఈ దేహము నందే దర్శనమిస్తుంది. మొదటిది మూలాధార చక్రము. ఇది గుదస్థానమున వుండును. దీనికి విఘ్నేశ్వరుడు అధిదేవత, రెండవది స్వాధిష్ఠాన చక్రము.
 
ఇది ఆధార చక్రమునకు రెండు అంగుళముల పైన ఉండును. దీని అధిదేవత బ్రహ్మ దేవుడు. మూడవది మణిపూరకచక్రము- ఇది స్వాధిష్ఠాన చక్రమునకు పైన మూడు అఃగులముల మీద నాభి ప్రాంతమున ఉండును. దీనికి అధిష్టాన దేవత విష్ణువు. నాలుగవది అనాహుత చక్రము- ఇది మణిపూర చక్రమునకు పది అంగుళములపైన హృదయము నందు ఉండును. దీనికి అధిష్టాన దేవత రుద్రుడు. ఐదవది విశుధ్ధచక్రము- ఇది అనాహుత చక్రమునకు పన్నెండు అంగుళాల పైన కంఠ స్థానమునందు ఉండును. దీనికి అధిష్ఠాన దేవత జీవుడు. స్థానము సరస్వతి. ఇక ఆరవది ఆజ్ఞేయ చక్రము- ఇది విశుద్ధ చక్రమునకు పన్నెండు అంగుళముల పైన భ్రూమధ్యస్థానమునందు ఉండును. దీని అదిష్టాన దేవత ఈశ్వరుడు.
 
ఈ షట్చక్రములపైన వున్న దానిని సహస్రారము అంటారు. ఇది విశుద్ధ చక్రము పైన బ్రహ్మ రంధ్రము నందు ఉండును. దీనియందు తేజోమయ రూపమైన సహస్రదళ కమలము ఓంకార నాదముతో ప్రకాశించును. షట్చక్రములపై దృష్టి ఉంచి సాధన చేయడం ద్వారా బ్రహ్మమును పొందవచ్చు అని స్వామివారు వివరిస్తుండగగా, మాదిగ కక్కయ్య బయట ఉండి విన్నాడు.
 
స్వామి వారిమీద మూఢ భక్తితో, మిడిమిడి జ్ఞానంతో స్వామివారి బోధలు సంపూర్ణముగా అర్థంకాక షట్ చక్రాలను వాటి అధిదేవతలను చూడాలన్న తాపత్రయముతో వడివడిగా ఇంటికి వెళ్లి పడుకుని ఉన్న భార్యను చూసి, అదే మంచి అదునుగా భావించి, కత్తి తీసి ముందుగా కంఠమును, తదుపరి మిగిలిన శరీరమును ఖండఖండాలుగా నరికి షట్చక్రములకోసం, వాటి అధిదేవతల కోసం పరికించి చూసాడు. ఏమీ కనిపించకపోయేసరికి కక్కయ్యకు కోపం వచ్చింది. ఈ సాములోరు అబద్దాల చెప్తూ భక్తులను మోసం చేస్తున్నాడు. ఈయన మాటలు విని నా భార్యని చంపుకున్నాను. నాలాగ ఎంతమంది మోసపోతున్నారో. సంగతేటో ఇప్పుడే తేల్చుకుంటాను అనుకుంటూ లంఘించుకుంటూ మరలా పీఠము వద్దకు వెళ్లాడు.
 
స్వామి వారు షట్చక్రముల దళముల సంఖ్య గురించి, వాటి వర్ణముల గురించి వివరిస్తున్నారు. అంతా అబద్దం, సోమిలోరు అబద్ధాలు చెపుతున్నారు అని గట్టిగా బయట నుండే అరుస్తూ వచ్చాడు. స్వామి వారు మందహాసం చేస్తూ రా నాయనా దగ్గరకి రా, ఏమయింది అన్నారు. కక్కయ్య అనుమానిస్తూ దూరంగా నిలబడ్డాడు. అంటరాని కులమంటూ ఏమీలేదు. దగ్గరకి వచ్చి నీ బాధేంటో చెప్పు అనడంతో‌ జలజలా కళ్ళెంట నీళ్లు కారుస్తూ మీ మాటలు నమ్మి, ఓంట్లోని చక్రాలు చూద్దామని మా ఆడదాన్ని ముక్కముక్కలు చేసినాను. ఎక్కడా చక్రాలు అవుపించలేదు సరికదా, అది సచ్చి ఊరుకుంది అంటూ రోదించ సాగాడు.
 
అంతట స్వామివారు... పద, మీ ఆవిడ దగ్గరకు తీసుకుని పద అని కక్కయ్య ఇంటికి వెళ్ళి, ముక్కలుగా పడి ఉన్న కక్కయ్య పడతి శరీరములో షట్చక్రములను వాటి అధి దేవతలను దర్శింపజేసారు. అనంతరం ఆ శరీరంపై విభూతి రాసి, మంత్ర జలము ప్రోక్షించి, కక్కయ్య భుజం మీది వస్త్రాన్ని తీసి దానిపై కప్పి బయటకు వచ్చి తలుపు వేసారు. కొంతసేపటి తరువాత కక్కయ్య చేత తలుపులు తీయించారు. నిద్రనుండి లేస్తున్నట్లు లేచిన భార్యను చూసి తన మూర్ఖత్వంతో మహానుభావుడిని నిందించాను అని బాధపడుతూ స్వామివారి పాదాలపై పడ్డాడు. స్వామివారు కక్కయ్య భుజాలు పట్టి లేపి, నాయనా గురు బోధను సరిగా అర్థం చేసుకుని పాటించాలి. తెలియక పోతే సందేహనివృత్తి చేసుకుని సాధన చెయ్యాలి అని అనునయించారు. (ఇంకా వుంది)

- కొమ్మోజు వెంకటరాజు