ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Updated : బుధవారం, 23 మే 2018 (18:41 IST)

అరటి తొక్కను తినమని ఆ భక్తుడికి సాయిబాబా ఎందుకిచ్చారు?

ఒకనాడు రేగే అను భక్తుడు మశీదులో ఉండగా ఎవరో ఒక భక్తుడు సాయిబాబాకు ఎర్రని అరటిపండ్లు తెచ్చి బాబాకు సమర్పించాడు. అవంటే రేగేకు చాలా ఇష్టం. వాటిలో కొన్ని బాబా తనకు ఇస్తాడని ఆశించాడు. వెంటనే బాబా అతనికేసి చూ

ఒకనాడు రేగే అను భక్తుడు మశీదులో ఉండగా ఎవరో ఒక భక్తుడు సాయిబాబాకు ఎర్రని అరటిపండ్లు తెచ్చి బాబాకు సమర్పించాడు. అవంటే రేగేకు చాలా ఇష్టం. వాటిలో కొన్ని బాబా తనకు ఇస్తాడని ఆశించాడు. వెంటనే బాబా అతనికేసి చూసి ఒకపండు తీసుకుని ఒలిచి పండంతా ఇతర భక్తులకు పంచి పైతొక్కు మాత్రం రేగేకు ఇచ్చి తినమన్నారు. అతడెలాగో అది తినేశాడు. తరువాత బాబా రెండవపండు, మూడవపండు కూడా తీసుకుని అలాగే చేశారు. నాల్గవపండు చేతిలోకి తీసుకుని అతనికేసి చూసి నేను నీకేమి ఇవ్వలేదా అని.... ఆ పండు వలిచి కొంచెం తాము కొరుక్కుని అదెంతో బాగుందన్నారు. 
 
తరువాత భాగం అతని నోటికందించి కొరుక్కోమన్నారు. మరలా బాబా ఒక ముక్క కొరికి అతనికి ఒక ముక్క ఇస్తూ పండంతా పూర్తి చేశారు. ఈ లీల గురించి ఆలోచిస్తే ఎంతో విలువైన ఆధ్యాత్మిక సూత్రాలు తెలుస్తాయి. మొదట ఆ పండ్లను చూడగానే రేగేకు జిహ్వ చాపల్యం కలిగింది. అది పండు రూపం చూడటం వలన, తానిదివరకే ఆ పండు తినిన అనుభవం గుర్తు రావడం వలన కలిగిన జిహ్వ చాపల్యం వలన బాబా ప్రసాదం అన్న భావమే అతనికి స్ఫురించకుండా పోయింది. అది ఒక బలహీనత అన్న గుర్తింపు కూడా అతనికి కలుగలేదు.
 
నామ రూపాల వల్ల కలిగిన లౌకిక సుఖ భ్రాంతి విడిస్తే గాని..... బాబా పరిభాషలో చెప్పాలంటే పంచేంద్రియాలను సమర్పిస్తే గానీ.... గురుకృప లభించదు. బాగా ఆలోచించి నామ రూపాత్మకమైన ఇంద్రియ విషయాలు నిజంగా సుఖమయములు గావని మొదట ముముక్షువు తెలుసుకోవాలి. అప్పుడు గాని విషయాల పట్ల వైరాగ్యం కలుగదు. కానీ అందుకు తగిన జీవితానుభవం సద్గురు కృప వల్లనే కలుగుతుంది. అందుకే సాయి రేగేను భ్రమింపజేసిన అరటి తొక్కను మాత్రమే అతనికి ఇచ్చారు. 
 
ఒకసారి కాదు ముమ్మారు.... నిజమైన ఆత్మ సుఖం ఇంద్రియ విషయాల మాటున దాగి ఉంటుంది. సద్గురువు దానినే అనుభవిస్తుంటారు. అటువంటి గురువు, విశ్వాసం, ఓరిమిలతో తమను శరణు పొంది, మొదట తాము ప్రసాదించిన కఠిన పరీక్షలను విశ్వాసంతో హృదయపూర్వకంగా స్వీకరించిన సచ్చిష్యునికి మాత్రమే ప్రసాదిస్తారు. దానిని అరటిపండు ఒలిచినట్లు అత్యంత సులభంగా బహిర్గతం చేసి నోటికి అందిస్తారు. ఓరిమితో గురువుని నమ్మి సేవించే వారికి ఉత్తమోత్తమైన శ్రేయస్సు చేకూరుస్తారు. ఈ విషయంపై భక్తునికి సద్గురువు పట్ల పూర్ణమైన విశ్వాసం ఉండాలి. 
 
అట్టివాడే సద్భక్తుడు. తాత్కాలికంగా అతనికి కూడా సద్గురువు ఇతరులను అనుగ్రహించినంత మాత్రం గూడా తనను అనుగ్రహించడం లేదని ఆ సమయంలో తోస్తుందని తెల్పడానికే బాబా నేను నీకేమి ఇవ్వలేదా అని రేగేను ప్రశ్నించారు.