శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో ఏకాంతంగా పుష్పయాగం
టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం పుష్పయాగం జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. ఆ తరువాత మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం జరిగింది.
ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 పలురకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి 6 రకాల పత్రాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఇందుకోసం దాదాపు 3 టన్నుల పుష్పాలను వినియోగించారు. వీటిని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.