శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం
శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల నుంచి బంగారం మాయమైన కేసులో అరెస్టయిన మాజీ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీపీ) అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం కావడంతో, ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ఈ కేసులో 17వ నిందితుడిగా ఉన్న ప్రశాంత్‌ను మంగళవారం రాత్రి తిరువనంతపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. ఆయన్ని తిరువనంతపురం జిల్లా జైలులో ఉంచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంటారని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తెలిపారు.
ప్రశాంత్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున, ఈ పరిణామాన్ని కొల్లం విజిలెన్స్ కోర్టుకు తెలియజేస్తామని అధికారులు పేర్కొన్నారు. 2025లో రీప్లేటింగ్ కోసం బంగారు వస్తువులను చెన్నైలోని ఒక సంస్థకు తరలించడానికి ప్రశాంత్ ఆమోదం తెలిపారని దర్యాప్తులో తేలడంతో, సిట్ ఆయన్ని జూలై 23న అరెస్టు చేసింది.
సిట్ తెలిపిన వివరాల ప్రకారం, 2019లో వేరొక టీడీపీ బోర్డు హయాంలో జరిగిన రీప్లేటింగ్ పనుల సమయంలో జరిగిన బంగారు నష్టాన్ని కప్పిపుచ్చడానికే ఈ చర్య చేపట్టారు. ప్రశాంత్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజిలెన్స్ కోర్టు ఆగస్టు 22న కొట్టివేసింది.
