తిరుమలలో శాస్త్రోక్తంగా మాఘభాను పూజ
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు మాఘభాను పూజను టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ పూజ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.దర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ సూర్య మండలంలో సమస్తదేవతలు కొలువై ఉంటారని, సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవంగా భాసిస్తున్నాడాన్నారు. విష్ణువు అలంకారప్రియుడు, శివుడు అభిషేకప్రియుడైతే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడని తెలిపారు. ''ఆరోగ్యం భాస్కరాదిత్చేత్'' అన్న విధంగా భాస్కరుడు జీవకోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడని తెలియజేశారు.
మాఘమాసంలో వచ్చే ఆదివారం సూర్యునికి ప్రీతికరమైనదని, ఈ రోజున సూర్యప్రార్థన, స్త్రోత్ర పారాయణంతో పాటు సూర్యనామావళి జపిస్తే సమస్త దోషాలు తొలగిపోతామన్నారు. లోకంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని టిటిడి మాఘభాను పూజ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఇందులో భాగంగా మంగళధ్వనితో వేద విజ్ఞానపీఠం సంస్కృత అధ్యాపకులు శ్రీ కృష్ణమూర్తి భాను పూజ ప్రారంభించారు. మొదటగా ప్రార్థన, సంకల్పం, అంగపూజ, షోడశోప పూజ, యంత్ర పూజ, సూర్య స్త్రోత్ర పఠనం, సూర్య నమస్కారాలు నిర్వహించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే పూజ, స్త్రోత్ర పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వేద విజ్ఞానపీఠం అధ్యాపకులు, వేద విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.