బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 13 ఆగస్టు 2020 (20:35 IST)

ఎస్వీబీసీ నూతన సిఈఓ బాధ్యతలు, ఆ ఒక్క కారణంతో పాత సిఈఓకు ఉద్వాసన

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సిఈఓగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు తెల్లవారుజామున శ్రీవారిని దర్సించుకున్న నూతన సిఈఓ మర్యాదపూర్వకంగా తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారిని కలిశారు. తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు నూతన సిఈఓ సురేష్ కుమార్. 
 
తిరుపతికి చేరుకుని అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి చెంత నూతన సిఈఓగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు నూతన సిఈఓ సురేష్ కుమార్. శ్రీవారి వైభవాన్ని ప్రపంచ నలుమూలల చాటిచెప్పేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 
 
ఎస్వీబీసీ సిఈఓగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు ఎస్వీబీసీ సిఈఓ పదవి వివాదాలకు కేరాఫ్‌గా ఉండేది. ప్రైవేటు వ్యక్తులు రెండు సంవత్సరాల పాటు ఇదే పదవిలో ఉంటూ ఫైరవీలు చేసేవారు. గతంలో ఎంతోమంది సిఈఓలపై ఆరోపణలు కూడా వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో ప్రైవేటు ఛానళ్ళ సిఈఓల కన్నా కేంద్ర సర్వీసుల్లో పనిచేసే వారిని తీసుకోవాలని భావించారు. దీంతో దూరదర్సన్‌లో విజయవాడ డైరెక్టర్‌గా ఉన్న సురేష్ కుమార్‌ను కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసులకు తీసుకొచ్చారు. మూడు సంవత్సరాల పాటు సిఈఓగా సురేష్ కుమార్ కొనసాగనున్నారు.
 
మరోవైపు గతంలో ఉన్న సిఈఓ అయోధ్య రామాలయ భూమి పూజకు సంబంధించి ఎస్వీబీసీలో ప్రత్యక్షప్రసారం ఇవ్వలేదు. ఇది కాస్త పెద్ద దుమారాన్నే రేపింది. అప్పటికే రెండు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న మాజీ సిఈఓ వెంకట నగేష్ కొన్నిరోజుల పాటు కొనసాగుతూ వచ్చారు.
 
కానీ చివరకు ఆ ఒక్క కారణంతో చివరకు ఉద్వాసన పలికారు. గతంలో కొన్ని ఛానళ్ళలో వెంకట నగేష్ సిఈఓగా పనిచేశారు. కొత్త సిఈఓ రాకతో పాత సిఈఓ బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయారు.