గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

పండుగల విషయంలో పంచాయతీ వద్దు : పంచాంగకర్తలకు శారదా పీఠాధిపతి పిలుపు

పండగల విషయంలో పంచాయతీ పెట్టడం కన్నా... భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను, ఉపద్రవాలను పసిగట్టి... ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పంచాంగకర్తలు దృష్టి సారించాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి పిలుపునిచ్చారు. విశాఖ శారదా పీఠంలో అర్చక ట్రైనింగ్ అకాడమీ తరఫున నిర్వహించిన దైవజ్ఞ సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వరూపానంద స్వామి ఈ సందేశాన్ని ఇచ్చారు. 
 
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో... మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, పంచాంగ కర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. పండుగలు అనేవి హిందువుల మనోభావాలకు సంబంధించినవి కనుక... వీటి విషయంలో విభేదాలను పక్కనపెట్టి, పంచాంగకర్తలు అందరూ ఏకతాటి మీద నిలవాలని స్వరూపానంద స్వామి దిశానిర్దేశం చేశారు. 
 
పండుగల విషయంలో అయోమయం నెలకొంటే, కరోనా కష్టాలతో ఇప్పటికే సతమతమవుతున్న భక్తులు... మరింత గందరగోళంలోపడే ప్రమాదముందని స్వరూపానంద స్వామి హెచ్చరించారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే శ్రీ ఫ్లవ నామ సంవత్సరానికి సంబంధించి పండుగల విషయంలో పంచాంగకర్తలు అంతా ఏకాభిప్రాయంతో తమ పంచాంగాలను ప్రచురించాలని ఈ సదస్సులో పాల్గొన్న వారికి స్వరూపానంద స్వామి స్పష్టం చేశారు.
 
పంచాంగకర్తల మధ్య పండుగల విషయంలో విభేదాలు ఉంటే, దాని ప్రభావం ప్రభుత్వాలతో పాటు... హిందూ దేవాలయ వ్యవస్థపై పడుతుందని స్వరూపానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది పండుగల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా ఈ దైవజ్ఞ సమ్మేళనంలో పాల్గొన్న పంచాంగకర్తలు అంతా తీర్మానం చేయాలని స్వామీజీ సూచించారు. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పంచాంగకర్తలు అందరితో పెద్ద ఎత్తున దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించినట్లు స్వరూపానంద స్వామి వెల్లడించారు.
 
ఈ దైవజ్ఞ సమ్మేళనంలో విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మనందేంద్ర స్వామి ఆశీస్సులు అందించారు. ఈ దైవజ్ఞ సమ్మేళనానికి దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు అర్చక ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలన సంస్థ డైరెక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు పాల్గొన్నారు.