ఆ భాగ్యం ఇన్నాళ్లకు దక్కింది... తితిదే ఈవో జవహర్ రెడ్డి
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంటూ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం ఇన్నాళ్లకు దక్కిందని తితిదే కొత్త ఈవోగా నియమితులైన ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన టీటీడీ ఈవోగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
తితిదే ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో జవహర్ రెడ్డిని నియమించిన విషయం తెల్సింది. ఈయన ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అనిల్ సింఘాల్‌ను బదిలీ చేసిన సమయంలోనే టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించబోతుందనే వార్తలు వచ్చాయి.
దీనిపై జవహర్ రెడ్డి స్పందిస్తూ, శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం ఇన్నాళ్ళకు దక్కిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే, వైద్య ఆరోగ్యశాఖలో నాడు- నేడు కార్యక్రమం కొత్త ఒరవడి సృష్టిస్తోందని, ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని జవహర్‌రెడ్డి తెలిపారు.