సరైన సాక్ష్యాలు లేవు.. అందుకే శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్
టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిపై నమోదు చేసిన అవినీతి కేసును చెన్నై సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు లభించలేదని కోర్టు తీర్పునిచ్చింది.
కొంతకాలం క్రితం ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెన్నైలోని శేఖర్ రెడ్డి నివాసంలో దాడులు చేశారు. ఆ సమయంలో రూ.12 లక్షల పాత కరెన్సీతో పాటు రూ.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లు, భారీ ఎత్తున బంగారం లభించింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ సోదాల తర్వాత ఆయన ఇంట భారీ మొత్తంలో లభించిన డబ్బుపై సీబీఐ, ఈడీలు కూడా విచారణ జరిపాయి. శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు కోట్లాది రూపాయల పాత కరెన్సీని కొత్త కరెన్సీగా మార్చుకునే ప్రయత్నం చేశారని, ఇందుకు బ్యాంకులతో పాటు, ఇతరుల సహకారం తీసుకున్నారని ఆరోపిస్తూ చార్జ్ షీట్ దాఖలు చేశాయి.
ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు, శేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారనడానికి సరైన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ అందించలేదని భావిస్తూ, కేసును కొట్టివేసింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తానేమీ అక్రమంగా డబ్బులను తరలించలేదని, చట్ట విరుద్ధమైన లావాదేవీలు నడిపించలేదని, ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పిందని అన్నారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని పన్నులను తాను చెల్లించానని, తాను సంపాదించిన ఆస్తులు అన్నీ సక్రమమైన మార్గంలోనే సంపాదించినవే తప్ప, అక్రమంగా కూడగట్టుకున్నవి కావని స్పష్టం చేశారు. తన ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలనూ కోర్టు ముందు ఉంచామని, సరైన తీర్పును వెలువరించిన న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలని పేర్కొన్నారు.