1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tech-enhanced spiritual experience along Tirumala queues

తిరుమల క్యూ కాంప్లెక్స్‌లలో వేచి వుండే భక్తుల కోసం ఏఐ, వీఆర్ కేంద్రాలు

Tirumala queues
Tirumala queues
తిరుమల క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులు వేచి ఉండే సమయాన్ని ఆధ్యాత్మిక అనుభూతితో నింపేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం కృత్రిమ మేధస్సు (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్) సాంకేతికతతో కూడిన భక్తి అనుభవ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. 
 
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ముందు, భక్తులు తమ నిరీక్షణ సమయాన్ని ధ్యానం, ఆధ్యాత్మిక విజ్ఞానం,  విశ్రాంతి కోసం వినియోగించుకునేలా చేయడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యం. గత ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు ఈ భక్తి అనుభవ కేంద్రం రూపుదిద్దుకుంది. 
 
ఇందులో సుమారు 8.4 మీటర్ల పొడవు, 2.025 మీటర్ల వెడల్పు కలిగిన 340 అంగుళాల భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీని ప్రధాన హాలులో 120 మంది భక్తులు కూర్చునే సదుపాయం ఉండగా, ధ్యానం, శిక్షణ కోసం ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక గదుల్లో ఒక్కొక్కదానిలో 20 మంది చొప్పున కూర్చునే వీలుంది. 
 
దీని ద్వారా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని, సుప్రభాతం, తోమాల సేవ, సహస్ర నామార్చన, అభిషేకం వంటి అరుదైన సేవలను వర్చువల్ విధానంలో వీక్షించే అవకాశం కలుగుతుంది. 12వ శతాబ్దం నుండి నేటి వరకు తిరుమల చరిత్రను వివరించడానికి ఏఐ, వీఆర్ సాంకేతికతలను వినియోగిస్తారు. ఆలయ చరిత్రలోని ముఖ్య ఘట్టాలు, శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని దృశ్యరూప కథనాల ద్వారా ప్రదర్శిస్తారు. 
 
క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం ఈ కేంద్రం ద్వారా మార్గదర్శక ధ్యానం గోవింద నామస్మరణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. వేచి ఉండే సమయంలో భక్తుల ఒత్తిడిని తగ్గించి, వారి మనస్సును ప్రశాంతంగా ఉంచడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని టీటీడీ తెలిపింది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
తిరుమలలో సెప్టెంబర్ 19న గరుడ వాహన సేవ.. భారీ ఏర్పాట్లు