భక్తుల లేని తిరుమల కొండ ... రూ.కోటి కిందకు పడిపోయిన ఆదాయం
కరోనా వైరస్ ప్రభావం తిరుమల కొండపై తీవ్రంగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే, తిరుమలో వసంతోత్సవాల సమయంలో భక్తులు కిటకిటలాడుతుంటారు. ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఓ వైపు తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతున్నా, భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. కరోనా భయంతో ప్రయాణాలు చేసేందుకు అత్యధికులు ఆసక్తిని చూపించడం లేదు. ఈ ప్రభావం తిరుమలపైనా పడింది.
శనివారం నాడు స్వామివారిని 23,998 మంది దర్శించుకోగా, 13,061 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం కూడా భారీగా పడిపోయింది. చాలా కాలం తరువాత హుండీ ఆదాయం రూ. 85 లక్షలకు తగ్గింది.
కరోనా సెకండ్ వేవ్ వల్లనే భక్తుల రద్దీ మందగించిందని, పరిస్థితులు చక్కబడేంత వరకూ టైమ్ స్లాట్ టోకెన్ దర్శనాల కోటాను విడుదల చేసే పరిస్థితి లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు.