శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:25 IST)

ఆపదమ్రొక్కులవాడి ఆనంద నిలయం ఎప్పుడు నిర్మించారో తెలుసా...!

తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాముఖ్యమైనదన్న విషయం అందరికీ తెలిసిందే. మహద్వారంకు ప్రవేశించినప్పటి నుంచి గర్భాలయం వరకు ఉన్న విగ్రహాలన్నింటికీ ఒక్కో చరిత్ర ఉంది. ఏదో సాదా సీదా చరిత్ర కాద

తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాముఖ్యమైనదన్న విషయం అందరికీ తెలిసిందే. మహద్వారంకు ప్రవేశించినప్పటి నుంచి గర్భాలయం వరకు ఉన్న విగ్రహాలన్నింటికీ ఒక్కో చరిత్ర ఉంది. ఏదో సాదా సీదా చరిత్ర కాదు సంవత్సరాల చరిత్రే. శ్రీనివాసుని గర్భాలయంలోని విశేషాలను తెలుసుకుందాం..!
 
కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామశిలామూర్తిగా ఆవిర్భవించి నిలిచి ఉన్న చోటే గర్భాలయం. దీనినే ఆనందనిలయం అంటారు. ఈ ఆనందనిలయంకు ఒక బంగారు గోపురం నిర్మించబడి ఉంది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు. శ్రీ స్వామివారి గర్భాలయం లోపలి భాగం 12.9 అడుగుల చతురస్ర మందారం. వయన మండపం గోడల కన్నా గర్భాలయం గోడలు రెండింతలుగా అంటే 7.2 అడుగుల మందాన్ని కలిగి ఉన్నాయి. 
 
ఆగమ శాస్త్రం ప్రకారం ఈ గోడల మందం చాలా ఎక్కువ అని చెప్పబడుతున్నది. అయితే ఈ గర్భగృహం గోడ 7.2 అడుగుల మందంకల ఒకే గోడ కాదని, శ్రీ స్వామివారి చుట్టూ ఉన్నప్రాచీనమైన కుడ్యానికి అనుసంధించి దాని చుట్టూ చాలా కొద్ది ఖాళీ స్థలంతో దానికి ఆనుకుని మరియొక గోడ చేర్చబడినందువల్లనే ఇంతటి మందమైన గోడ ఏర్పడిందని, లోపల గోడకంటే దానికి ఆనుకుని కట్టబడిన వెలుపలి గోడ కొత్తదని పరిశోధకులు నిగ్గు తేల్చి చెప్పిన విషయం. పైగా ఈ వెలుపలి కొత్త గోడ మీదే ఆనందనిలయ విమాన నిర్మాణం జరిగినట్లు కూడా భావిస్తున్నారు. ఈ ఆనంద నిలయ విమాన నిర్మాణం క్రీస్తు శకం 1244-50 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినట్లు, అంతకుముందు వెలుపలి గోడ నిర్మాణం కాకపూర్వం, గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గం ఉండేదని పరిశోధకుల నిశ్చితాభిప్రాయం.
 
అయితే కాలక్రమేణ ఆనంద నిలయ విమాన నిర్మాణం కావించడం వల్ల తదనుగుణంగా శయనమండపం, రాములవారి మేడ - ఈ నిర్మాణాలు జరిగినందువల్ల ఈ ప్రదక్షిణ మార్గం మూసివేయబడిందట. ఈ గర్భాలయంలో మధ్యన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వచ్చి సాలగ్రామశిలామూర్తిగా శ్రీ వేంకటేశ్వరస్వామి అనే నామధేయంతో చతుర్భుజుడై, వక్షస్థల మహాలక్ష్మీసమేతుడై నిలిచి ఉన్న మూర్తిగా విరాజిల్లుతూ ఉన్నాడు. ఆనాటి నుంచి అత్యంత ప్రాచీనమైన వైఖానసాగమం ప్రకారం శ్రీ స్వామివారికి పూజలు, ఉత్సవాలు, సేవలు జరుపబడుతూ ఉన్నాయి.
 
ఈ గర్భాలయంలో స్వామివారి మూలమూర్తి (మూలవిరాట్‌) కదలని ధృవమూర్తి. ఇంతమాత్రమే కాక చలప్రతిష్టతో (కదిలించగల) ఏర్పాటు చేయబడిన ఉత్సవ, కౌతుక, బలి, స్నాపన బేరాలని పిలువబడే శ్రీ వేంకటేశ్వరస్వామివారి మరియు నాలుగు విగ్రహమూర్తులు విరజిల్లుతూ ఉన్నాయి. ఇవన్నీ పంచలోహ మూర్తులు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి పంచమూర్తులే కాక, శ్రీ సుదర్సనా చక్రతాళ్వార్‌, శ్రీ సీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వీరందరి పంచలోహ ఉత్సవ ప్రతిమలు కూడా ఈ గర్భాలయంలో నెలకొని ఉన్నాయి. 
 
ఇదేకాకుండా ఈ గర్భాలయంలో శ్రీ స్వామివారి సన్నిధిలో వివిధ రకములైన పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్యాభిషేకార్చనలను, నివేదనలను అందుకొంటూ ఉన్నాయి. ఈ గర్భాలయంలోనే స్వామివారికి కుడివైపున ఆగ్నేయమూలకు, ఎడమవైపున ఈశాన్యమూలకు బ్రహ్మా అఖండం అను దీపారాధనలు నిత్యమూ వెలుగుతూ ఉంటాయి. తొట్ట తొలిగా వీటిని బ్రహ్మదేవుడు వెలిగించాడని ప్రతీతి. గోవిందా... గోవిందా... అని స్మరించండి!