ఉచితంగా ఒక లడ్డూ.. అదనపు లడ్డు ధర రూ.50
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉచిత లడ్డూ విషయంలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం జనవరి 19వ తేదీ ఆదివారం రాత్రి నుంచి అమల్లోకిరానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాయితీ లడ్డూ విధానానికి స్వస్తి చెప్పనుంది.
లడ్డూ ప్రసాదం పంపిణీలో ఆదివారం అర్థరాత్రి నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రతి భక్తులడికీ ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తామని తెలిపారు. ప్రతీ అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలని వెల్లడించారు. ఇందుకోసం 12 అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
అలాగే, రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్, ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులకు కొత్త విధానం అమలు చేయనున్నారు.