బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (17:06 IST)

బ్రెగ్జిట్ ఫలితాలు : సెన్సెక్స్ సూచి నేలచూపులు ... పరుగు పెట్టిన బంగారం ధర

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా? వద్దా? అనే అంశంపై జరిగిన బ్రెగ్జిట్ పోల్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాలు ప్రపంచ మార్కెట్ల పాలిటశాపంగా పరిణమించాయి. ఫలితంగా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మరోవైపు బంగారం మాత్రం పరుగులు తీసింది.
 
ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఫలితంగా భారీ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 604 పాయింట్లు నష్టపోయి 26,397 పాయింట్ల వద్ద ముగిస్తే, నిఫ్టీ 181 పాయింట్లు నష్టపోయి 8,088 పాయింట్ల వద్ద ముగిసింది. 
 
ఈ ట్రేడింగ్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, భారతీ ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, గెయిల్ సంస్థల షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. టాటా గ్రూప్‌నకు చెందిన 3 సంస్థలు టాటా మోటార్స్, టాటా మోటార్స్(డీ), టాటా స్టీల్ భారీ నష్టాలతో ముగిసింది. హిండాల్కో, టెక్ మహీంద్రా సంస్థల షేర్లు కూడా నష్టాల బాట పట్టాయి.
 
అదేసమయంలో బ్రెగ్జిట్‌ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడింది. పసిడి ధర శుక్రవారం రెండేళ్ల గరిష్టానికి పెరిగింది. 26
నెలల్లో అత్యధికంగా శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.30,885కు చేరింది. 2013 ఆగస్టు తర్వాత ఒక్క రోజులో బంగారం ధర ఇంతగా పెరిగడం ఇదే కావడం గమనార్హం. 
 
అలాగే 2014 ఏప్రిల్‌ 28న 10 గ్రాముల బంగారం ధర రూ.30,730కు చేరిన తర్వాత మళ్లీ శుక్రవారం అధికంగా రూ.30,885కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.1000 పెరిగి రూ.42,300 అయ్యింది. బ్రెగ్జిట్‌ ప్రభావంతో రూపాయి విలువ కూడా పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.21 పైసలకు చేరింది.