గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (12:04 IST)

బ్రెజిల్‌ను మట్టికరిపించిన అర్జెంటీనా.. నెరవేరిన మెస్సీ స్వప్నం

తమ చిరకాల స్వప్నాన్ని అర్జెంటీనా నెరవేర్చుకుంది. యో డి జెనీరో వేదికగా జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్లో బ్రెజిల్‌‌ను అర్జెంటీనా మట్టికరిపించింది. నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 గోల్ తేడాతో ప్రత్యర్థి బ్రెజిల్‌పై విజయం సాధించింది. 
 
అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డీ మారియా సాధించిన గోల్‌తో ఆ జట్టు విజేతగా నిలిచింది. దీంతో 15వ కోపా టైటిల్‌ను అర్జెంటీనా ముద్దాడింది. ఈ విజయంతో 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు ఓ మేజర్ టోర్ని టైటిల్‌ను మెస్సీ తమ దేశానికి అందించాడు. 
 
కాగా, మెస్సీకి ఇదే తొలి కోపా టైటిల్ కూడా కావడం గమనార్హం. అంతేగాక మెస్సీ కెరీర్‌లోనే ఇదే మొదటి అంతర్జాతీయ టైటిల్ కావడం గమనార్హం. దీంతో తన సారథ్యంలో దేశానికి ఓ అంతర్జాతీయ టైటిల్ తెచ్చిపెట్టాలనే మెస్సీ కల నెరవేరింది. 
 
ఆ దేశానికి చెందిన దిగ్గజ ఆటగాడు మారడోనా నేతృత్వంలో కూడా అర్జెంటీనా కోపా టైటిల్ గెలవలేదు. 1937లో తొలిసారి కోపా కప్ గెలిచిన అర్జెంటీనా.. చివరిసారిగా 1993లో ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడే ఆ ఫీట్‌ను రిపీట్ చేసింది.