శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (12:35 IST)

మీరాభాయ్‌ సిల్వర్ గెలిస్తే ప్రియా మాలిక్‌కు బంగారు పతకం...

టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో మీరాభాయి చాను వెండి పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో ఆమె దేశానికి గర్వకారణంగా నిలిచారు. అయితే, ఆదివారం మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. ఆమె పేరు ప్రియా మాలిక్.
 
ఆదివారం జరిగిన రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. హంగేరీలో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది. 
 
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 
 
57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీపడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.