టోక్యో ఒలింపిక్స్ : ప్రారంభ మ్యాచ్‌లో పీవీ సింధు గెలుపు
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో ఇప్పటివరకు భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మూడో రోజైన ఆదివారం స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్‌పోను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్ షెట్లర్‌కు పొలికర్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. దీంతో సింధు 21-7, 21-10తో విజయం సాధించింది.
ఇక ఒలింపిక్స్ మూడో రోజు షూటర్లు నిరాశ పరిచినప్పట్టికీ రోయింగ్, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మంచి ఫలితాలు ఎదురయ్యాయి. రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్, అర్వింద్ సింగ్ అదరగొట్టారు. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్‌లో టాప్-3లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ పోటీలు జూలై 27న జరగనున్నాయి.
మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు చుక్కెదురయింది. స్టార్ షూటర్లు మను బాకర్, యశస్విని దేస్వాల్ టాప్-8కు అర్హత సాధించలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఇద్దరు నిష్క్రమించారు. మను బాకర్ 12వ స్థానంలో, యశస్విని 13 స్థానంలో నిలిచారు.