సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (09:07 IST)

కరోనా ఎఫెక్టు.. అండర్-17 బాలికల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ రద్దు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరో అంతర్జాతీయ క్రీడా పోటీలు రద్దు అయ్యాయి. అండర్-17 బాలికల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలు నిజానికి ఈ నెల రెండో తేదీ నుంచి జరగాల్సివుంది. అయితే, కరోనా కారణంగా వచ్చే యేడాది ఫిబ్రవరికి వాయిదావేశారు. కానీ, ఇపుడు వచ్చే యేడాది కూడా సాధ్యపడే వీలులేకపోవడంతో పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫీఫా) ప్రకటించింది. ఈ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సివుంది. 
 
ఇదేసమయంలో 2022 పోటీలను జరిపే అవకాశం ఇండియాకు ఇస్తున్నామని స్పష్టం చేసింది. తాజాగా సమావేశమైన ఫీఫా కౌన్సిల్, ప్రపంచంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న పరిస్థితులను సమీక్షించి, ఈ నిర్ణయం తీసుకుంది. అండర్-17తో పాటు కోస్టారికాలో జరగాల్సిన అండర్-20 బాలికల వరల్డ్ కప్‌ను కూడా రద్దు చేస్తున్నామని, 2022లో కోస్టారికాలోనే ఈ పోటీలు జరుగుతాయని ఫీఫా ఓ ప్రకటనలో తెలిపింది. 
 
"ఈ టోర్నమెంట్‌లను మరింతగా వాయిదా వేయడానికి వీల్లేదు. అందువల్ల 2020 ఎడిషన్‌ను రద్దు చేస్తున్నాం. సభ్య దేశాలన్నీ ఇదే కోరుకున్నాయి. 2020లో పోటీలకు ఆతిథ్యమిచ్చే దేశాలకే, తదుపరి ఎడిషన్ పోటీలను జరిపేందుకు అవకాశం ఇస్తున్నాం" అని వెల్లడించింది.
 
వాస్తవానికి ఈ పోటీలు ఇండియాలోని ఐదు నగరాల్లోని మైదానాల్లో నవంబర్ 2 నుంచి 21 వరకూ జరగాల్సి వుండగా, వాటిని ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7కు తొలుత వాయిదావేశారు. అయితే, కాన్ఫెడరేషన్స్ ఆఫ్ ఆఫ్రికా, నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా తదితరాలు ఇప్పటికీ క్వాలిఫయింగ్ టోర్నీలను నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనూ పోటీల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఫీఫా... ఈ పోటీలను నిరవధికంగా వాయిదావేసింది.