సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (13:00 IST)

రెజ్లర్ తలపై ఢిల్లీ పోలీసుల రివార్డు... లొంగిపోనున్న సుశీల్ కుమార్

సాటి సాగర్ ధంక‌ర్ కిడ్నాప్‌, హ‌త్య కేసులో తప్పించుకు తిరుగుతున్న భారత మల్లయుద్ధ వీరుడు (రెజ్లర్) సుశీల్ కుమార్ తలపై ఢిల్లీ పోలీసులు రివార్డు ప్రకటించారు. అతడిని పట్టించినా, ఆచూకీ చెప్పినా రూ.లక్ష నజరానాను అందజేస్తామని ప్రకటించారు. ఇదే కేసులో మరో నిందితుడు అజయ్‌పై రూ.50 వేల నజరానా ప్రకటించారు.
 
మే 4న ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన గొడవలో.. తోటి రెజ్లర్లపై సుశీల్, అతడి సహచరులు దాడికి దిగారు. ఆ దాడిలో తీవ్రగాయాలపాలైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సాగర్ రాణా అనే 23 ఏళ్ల యువ రెజ్లర్ కన్నుమూశాడు. ఆ దాడితో తమకు సంబంధం లేదని మొదట్లో సుశీల్ ప్రకటించినా.. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించకుండా పోయారు. 
 
ముఖ్యంగా, ఢిల్లీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరికొందరిపైనా ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
 
ఇదిలావుంటే, సాగర్ ధంక‌ర్ కిడ్నాప్‌, హ‌త్య కేసులో ప్రధాన నిందితుడు రెజ్ల‌ర్ సుశీల్ కుమార్ పోలీసుల‌కు లొంగిపోయే ప‌రిస్థితుల్లో ఉన్నాడు. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లోని ఏ కోర్టులోనైనా సుశీల్‌ ఒకటి లేదా రెండు రోజుల్లో లొంగిపోయే అవ‌కాశాలున్నాయి. ఈ మేర‌కు మోడల్ టౌన్ పోలీసుల‌కు వాట్సాప్ సమాచారం అందింది. 
 
ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ సుశీల్‌తో పాటు అతని స్నేహితుల‌ను అరెస్టు చేయడానికి విస్తృతంగా గాలిస్తున్నామ‌న్నారు. ఇంతేకాదు సుశీల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అత‌ని భార్య, ఇతర కుటుంబ సభ్యులను కూడా  ప్రశ్నిస్తున్నామ‌న్నారు.
 
అయితే ఇంతలోనే సుశీల్ తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తును దాఖలు చేయబోతున్నట్లు స‌మాచారం అందింది. అయితే నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ కావ‌డంతో అత‌ని ప్ర‌య‌త్నాలు ఆగిపోయాయ‌న్నారు. అత‌ని బంధువుల‌ను ప్రశ్నించినప్పుడు, కోర్టులో లొంగిపోవడానికి సుశీల్‌ సిద్ధమవుతున్నాడ‌ని వారు తెలిపార‌న్నారు. 
 
అయిన‌ప్ప‌టికీ రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో సుశీల్ తన స్నేహితుల‌తో కలిసి నజాఫ్‌గఢ్ ‌- బహదూర్‌గ‌ఢ్‌ - జజ్జర్ త‌దిత‌ర ప్రాంతాల్లో దాక్కున్నట్లు గుర్తించారు.