మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (10:54 IST)

టూల్ కిట్ కేసు : మరో ఇద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్

టూల్ కిట్ కేసులో సోమవారం ఢిల్లీ పోలీసులు ఇద్ద‌రికి నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ చేశారు. నికితా జాక‌బ్‌, షంత‌న్‌ల‌పై ఆ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ ఇద్దరూ టూల్ కిట్ వివాదంలో ఉన్న‌ట్లు ఢిల్లీ పోలీసులు భావించి ఈ నోటీసులు జారీచేశారు. 
 
టూల్ కిట్ అంటే సోష‌ల్ మీడియాలో ఓ డాక్యుమెంట్‌. అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ ఈ టూల్‌కిట్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపింది. 
 
ఆ టూల్ కిట్‌ను బ‌ట్టే.. ఇండియా బ‌య‌ట కూడా దేశానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింద‌ని, అందులో ట్విట‌ర్ కీల‌క పాత్ర పోషించింద‌ని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ కేసులోనూ బెంగుళూరుకు చెందిన దిశ ర‌వి అనే యువ కార్య‌క‌ర్త‌ను కూడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, బెంగళూరు ఐటీ సిటీకి చెందిన 22 ఏళ్ల పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం, ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించడంపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, రచయితలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన టూల్‌ కిట్‌ను దిశా రవి అప్‌లోడ్‌ చేశారన్నది ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ టూల్‌కిట్‌ రైతులను రెచ్చగొడుతోందని దిశా రవిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
 
ఇక ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్, "ఇది పూర్తిగా వేధింపు చర్యే. దిశా రవికి నేను అండగా ఉంటాను. ఆమెపై వేధింపులు ఆపాల్సిందే" అని అన్నారు. ఆ వెంటనే మరో సీనియర్ నేత చిదంబరం తన ట్విట్టర్ ఖాతాలో, "దిశా రవి అరెస్ట్ ను ఖండిస్తున్నాం. ఆమె అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, యువత, విద్యార్థులు గళం విప్పాలి" అన్నారు. 
 
దిశా రవి అరెస్ట్ దురదృష్టకరమని, తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, ఆమెకు ఎటువంటి నేర చరిత్రా లేదని గుర్తు చేశారు. శశిథరూర్ సైతం దిశ అరెస్ట్ ను ఖండించారు.