సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (20:00 IST)

ధాతృత్వం ధారాళం : సెర్బియా టెన్నిస్ స్టార్ రూ.8.2 కోట్ల విరాళం

ప్రపంచం కరోనా మహమ్మారి గుప్పెట్లో చిక్కకుంది. ఈ వైరస్ బారినపడిన అనేక దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. అభివృద్ధి చెందిన అనేక దేశాలు వైద్యసేవలు అందించలేక చేతులెత్తేశాయి. అలాంటి వాటిలో అందమైన ఇటలీ ఒకటి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన మూడో దేశం. మరణాల్లో రెండో స్థానంలో ఉంది. అలాగే, అనేక దేశాలు కరోనా వైరస్ బారినపడి కొట్టుమిట్టాడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైద్యులకు సాయం చేసేందుకు, బాధితులను ఆదుకునేందుకు వీలుగా అనేక మంది ముందుకు వచ్చి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ కోవలో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. వెంటిలేటర్లతో పాటు అధునాతన వైద్య పరికరాలు కొనేందుకు స్వదేశానికి 1.1మిలియన్ డాలర్లు (దాదాపు 8.2కోట్లు) అందించాడు. 
 
"సెర్బియాతో పాటు ప్రపంచంలో కరోనాతో బాధపడుతున్న వారికి సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అని సెర్బియా మీడియాతో వీడియో కాన్ఫరెన్స్​లో జకోవిచ్ చెప్పాడు. సెర్బియాలో ఇప్పటివరకు 457 కరోనా కేసులు నమోదవగా, ఏడుగురు మృతి చెందారు. 
 
ఇప్పటికే స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సైతం మిలియన్ డాలర్లను స్విట్జర్లాండ్​లోని ఓ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చాడు. స్పానిష్​ అథ్లెట్లు 12.13మిలియన్ డాలర్ల నిధులను కరోనా బాధితుల కోసం పోగు చేయాలని స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్​ పిలుపునిచ్చాడు.