Novak Djokovic: కెరీర్‌లో 100వ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న నోవాక్ జొకోవిచ్
సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ జెనీవా ఓపెన్‌లో ఘన విజయంతో తన కెరీర్‌లో 100వ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తద్వారా అరుదైన మైలురాయిని సాధించాడు. శనివారం, జొకోవిచ్ ఫైనల్‌లో 5-7, 7-6 (2), 7-6 (2) స్కోరుతో హుబర్ట్ హుర్కాజ్‌ను ఓడించి, తన కెరీర్‌లో 100వ మైలురాయి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
ఈ విజయం తర్వాత, నోవాక్ జొకోవిచ్ మీడియాతో మాట్లాడుతూ.. " జెనీవాలో నా 100వ సింగిల్స్ టైటిల్‌ను సాధించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. దాని కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. మ్యాచ్ అంతటా, హుబర్ట్ నాకంటే విజయానికి దగ్గరగా ఉన్నాడు.
నేను అతని సర్వీస్‌ను ఎలా బ్రేక్ చేయగలిగానో నాకు తెలియదు. బహుశా అతను 4-3తో ఆధిక్యంలో ఉన్నప్పుడు తనను తాను బ్రేక్ చేసుకున్నాడు. అతను గట్టిపోటీ ఇస్తూ మెరుగ్గా ఆడాడు. ఇది కఠినమైన పోరాటం అనడంలో ఎటువంటి సందేహం లేదు." అంటూ తెలిపాడు
ఈ విజయంతో, నోవాక్ జొకోవిచ్ టెన్నిస్ చరిత్రలో 100 కెరీర్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్న మూడవ ఆటగాడిగా నిలిచాడు. 109 టైటిళ్లతో జిమ్మీ కానర్స్, 103 టైటిళ్లతో రోజర్ ఫెదరర్ మాత్రమే అతని ముందు ఈ ఘనతను సాధించారు. జొకోవిచ్ గతంలో పారిస్ ఒలింపిక్స్‌లో తన 99వ టైటిల్‌ను గెలుచుకున్నాడు.