సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (08:13 IST)

చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి... ప్రపంచ బాక్సింగ్‌లో మరోమారు విన్నర్

Nikhat Zareen
తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన 50 కేజీల ఫైనల్ విభాగంలో ఆమె 5-0 తేడాతో వియత్నాంకు చెందిన ఢీ ధామ్ న్యూయెన్‌ను చిత్తు చేశారు. ఫలితంగా 26 యేళ్ల నిఖత్.. ఈ టోర్నీలో రెండోసారి విజేతగా నిలిచి బంగారు పతకాన్ని అందుకున్నారు. 
 
28 ఏళ్ల న్యూయెన్ కూడా ధీటుగా బదులివ్వడంతో ఈ బౌట్ హోరాహోరీగా సాగింది. ఒకరిని మరొకరు తోసేసుకోవడం, కింద పడిపోవడం, మెడను అణిచిపెట్టి పంచ్‌లు విసరడం.. ఇలా ఈ మ్యాచ్ ఓ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. బాక్సర్లిద్దరూ ఒక్కోసారి రిఫరీ నుంచి హెచ్చరిక (ఎల్లో కార్డు) కూడా అందుకున్నారు. 
 
తన ఎత్తును అనుకూలంగా మార్చుకుని న్యూయెన్ గట్టిపోటీనిచ్చింది. నిఖత్‌ను ఒకసారి తోసేసింది. పడి లేచిన నిఖత్ అప్పర్ కట్, హుక్ పంచ్లతో చెలరే గింది. తన మెడను కిందకు వచ్చి.. న్యూయెన్ ఆధిపత్యం చలాయించాలని చూసినా నిఖత్ ఆగలేదు. ఎదురు దెబ్బలు తిన్నా.. తిరిగి లెక్క సరిచేసింది. తొలి రౌండ్లో నిఖతే పూర్తి అధిపత్యం సాధించింది. 
 
రెండో రౌండ్లో ఆమె మరింతగా చెలరేగింది. ముఖంపై ఎడమ చేతి పంచ్‌లతో రెచ్చిపోయింది. ఆఖరి రౌండ్‌ పోరు మరోస్థాయికి చేరింది. ఇద్దరు బాక్సర్లు ఒకరిపై మరొకరు పడిపోతూ... పంచ్‌లు గుప్పించుకున్నారు. నిఖత్ కుడిచేత్తో బలంగా ఓ పంచ్ ఇవ్వడంతో.. ప్రత్యర్థికి దిమ్మతిరిగింది. దీంతో రిఫరీ ఎనిమిది అంకెలు (8 కౌంట్) లెక్క పెట్టిన తర్వాత మళ్లీ బౌట్ కొనసాగించింది. 
 
ఈ సారి న్యూయెన్ బలంగా నిఖతకు పంచ్ ఇవ్వడంతో రిఫరీ మళ్లీ 8 కౌంట్ చేసింది. అయిదుగురు జడ్జీలూ నిఖత్కే ఓటు వేయడంతో ఆమె సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, ఈ ఛాంపియన్ షిప్స్ భారత్ గెలిచిన బంగారు పతకాలు నాలుగు. స్వర్ణాల పరంగా 2006 ప్రపంచ ఛాంపియ ఉత్తమ ప్రదర్శనను ఇప్పుడు సమమైంది.