మాడ్రిడ్ ఓపెన్లో ఖంగుతిన్న టాప్ సీడ్లు: సెరెనా విలియమ్స్‌కు ఫ్లూ..!
మాడ్రిడ్ ఓపెన్ తొలి రౌండ్లోనే టాప్ సీడ్లకు చుక్కెదురైంది. ఈ టోర్నీకి ఫ్లూ జ్వరంతో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి, అమెరికా నల్ల కలువ సెరీనా విలియమ్స్ దూరమైన నేపథ్యంలో, టాప్ సీడ్స్‌గా ఈ టోర్నీ బరిలోకి దిగిన క్రీడాకారులు అనూహ్యంగా పరాజయం పాలయ్యారు.
టాప్‌సీడ్ రద్వాన్‌స్కా, ఆస్ట్రేలియా ఓపెన్ మాజీ ఛాంపియన్, రెండోసీడ్ ఏంజెలిక్ కెర్బెర్ తొలిరౌండ్లోనే ప్రత్యర్థుల చేతిలో ఖంగుతిన్నారు. ప్రత్యర్థులపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమయ్యారు.
ప్రత్యర్థుల షాట్లను ధీటుగా ఎదుర్కొన్నా టాప్ సీడ్లైన కెర్బెర్, రద్వాన్‌స్కాలకు ఓటమి తప్పలేదు. కాగా స్లోవేకియా క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవాతో తలపడిన రద్వాన్‌స్కా 6-4, 6-7 (3/7), 6-3 తేడాతో ఓడిపోగా, జర్మనీ క్రీడాకారిణి రెండో సీడ్ కెర్బర్ బార్బరా (చెక్ రిపబ్లిక్) చేతిలో 6-4, 6-2తో ఘోర పరాజయం పాలైంది.
అలాగే పురుషుల సింగిల్స్‌లో బల్గేరియన్ క్రీడాకారుడు దిమిత్రోవ్.. 6-7 (5-7) 7-6 (7-4) 6-0 పాయింట్ల తేడాతో డిగో చేతిలో ఖంగుతిన్నాడు. తద్వారా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.