గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (10:13 IST)

ఓటర్లకు డబ్బుల పంపిణీ : రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లలో దాడులు

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏ. రేవంత్ రెడ్డిని, ఆయన అనుచరులను తెలంగాణ పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న అనుమానంతో రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్ళలో తెలంగాణ పోలీసులు సోదాలకు దిగారు. దీంతో కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారని అభిమానులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొడంగల్‌లో శనివారం (డిసెంబర్ 1) అర్థరాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 
 
రేవంత్ అనుచరుడు యూసఫ్‌తో పాటు పలువురు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. యూసఫ్, రామచంద్రారెడ్డి, మదుసూదన్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న రేవంత్ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
అనంతరం రేవంత్‌తో పాటు పలువురు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రేవంత్ అనుచరుడు యూసఫ్ డబ్బులు పంచుతున్నారనే సమాచారంతోనే సోదాలు నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. అనుమానం ఉన్న ప్రతి చోట తనిఖీలు జరుపుతామని ఏడీజీ జితేందర్ తెలిపారు. అయితే సోదాల్లో ఏం దొరికాయన్న విషయం మాత్రం బయటకు రాలేదు. రేవంత్ ఇంట్లో సోదాలు చేయలేదని పోలీసులు తెలియజేశారు.
 
మరోవైపు, పోలీసుల వైఖరిపై రేవంత్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. తన అనుచరులపై కుట్రపూరితంగా కేసీఆర్ ఐటీ దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 4న కొడంగల్ నియోజకవర్గ బంద్‌కు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. అలాగే 4న కేసీఆర్ కోస్గి పర్యటనను అడ్డుకుంటామని చెప్పారు.