సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (13:51 IST)

రాహుల్ - చంద్రబాబులే సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారు : ఉత్తమ్ కుమార్

తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంలు కలిసి సమిష్టింగా సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ సారథ్యంలో ప్రజాకూటమి ఏర్పాటైంది. ఈ కూటమికే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. 
 
ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, తెలంగాణ సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా తనకు సమ్మతమేనన్నారు. ప్రజాఫ్రంట్‌కు సంబంధించి సీఎం అభ్యర్థి ఎంపిక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సలహా ద్వారానే జరుగుతుందన్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల సమష్టి నిర్ణయం మేరకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఆ విధంగా ఎవరు ఎంపికైన తనకు ఇష్టమేనని చెప్పారు. 
 
నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజలు కోరుకున్న పాలన అందించడమే ప్రజా ఫ్రంట్‌ లక్ష్యమని, మేనిఫెస్టోను వంద శాతం అమలు చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిగ్గు, శరం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై నిందలు మోపి తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరిట దోచుకుని, దాచుకున్న సొమ్మును కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు.