సోమవారం, 23 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (12:59 IST)

మతం మార్చుకున్న పాలకులే మహాపాపానికి పాల్పడగలరు : బీజేపీ నేత మాధవీలత

madhavilatha
పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని, మతం మార్చుకున్న పాలకులే మహాపాపానికి పాల్పడగలరని భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేత, గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహిళా అభ్యర్థి మాధవీలత కోరారు.  
 
సాక్షాత్తు వైకుంఠ వాసుడే మనకోసం కొలువైన దివ్య క్షేత్రం తిరుమల అని భక్తుల ప్రగాఢ విశ్వాసమని, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్షేత్రం కూడా తిరుమలే అని  అటువంటి క్షేత్రంలో భగవంతుని ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వ్యవహారం తీవ్ర మనోవేదనకు గురవుతుందని చెప్పారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి స్పందించాలని కోరారు. కేంద్రంలో ఉన్న మంత్రులు ఈ వ్యవహారంపై స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని మాధవీలత విజ్ఞప్తి చేశారు.
 
'మతమార్పిడి చేసుకున్న నాయకులు పరిపాలించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్లకి సంబంధించిన మందిరాల్లో హిందువులని నియమించుకుంటారా... అలాంటివి ఏమీ ఉండవు కదా, మరి హిందూ దేవాలయాల్లో అలాంటి వారు ఎలా నియమించబడుతున్నారు? ఈ విషయంపై హిందువులందరూ కలిసి పోరాడాలి. ఎవరు వదిలిపెట్టినా ఈ విషయంలో నిజం తేలే వరకు నేను వదిలిపెట్టను' అని మాధవీలత స్పష్టం చేశారు.
 
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అపచారం మాటల్లో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య పరిస్థితి అది. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న ప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్ధంతో చేయడం అంటే... ఈ జన్మకి ఇంతకన్నా పాపాన్ని అంట కట్టుకోవడం ఇంకోటి ఉండదు.
 
అందరం కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం అనే కంటే ఆ ప్రసాదాన్ని భక్షిస్తున్నాం అనడం సబబుగా ఉంటుందేమో. జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన తర్వాత... ప్రసాదాన్ని తింటున్నాం అనే మాట నేను అనలేకపోతున్నాను. భక్షించే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇన్ని వేలమంది, కోట్ల మంది హైందవుల నమ్మకాన్ని భక్తిని అడ్డం పెట్టుకొని మోసం చేయాలనుకున్న ఆ దుర్మార్గులు ఎవరో కానీ పరమేశ్వరుడు వారికి పుట్టగతులు లేకుండా చేస్తాడు. వాళ్ళు ఎవరన్నది తేలాల్సిందే' అని మాధవీలత పేర్కొన్నారు.