గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (10:43 IST)

నేతలకు కార్యకర్తలకు కన్నీటితో మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి.. ఏంటి.. ఎందుకు?

kcr hospital
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు కన్నీటితో ఓ విజ్ఞప్తి చేశారు. కాలి తుంటె ఎముక ఆపరేషన్ కారణంగా ఆయన హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా ఆస్పత్రికి తరలి వస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని ఇతర రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అలాగే, ఆస్పత్రి పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. పైగా, కేసీఆర్‌కు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
'ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాది, వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో యశోద ఆస్పత్రిలో చేరాను. ఈ సందర్భంలో వైద్య బృందం నన్ను సీరియస్‌గా హెచ్చరించింది. అదేంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి. దాంతో నెలల తరబడి బయటకు పోలేరని చెబుతున్నారు. దాన్ని గమనించి, దయచేసి మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరందరూ బాధపడకుండా మీ స్వస్థలాలకు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి వెళ్లాలి.
 
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంకో పది రోజుల వరకు ఎవరూ కూడా తరలిరావొద్దని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. హాస్పిటల్లో మనం కాకుండా వందలాది మంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ల క్షేమం కూడా మనకు ముఖ్యం. కాబట్టి మీరు అన్యదా భావించకుండా, క్రమశిక్షణతో మీ ఇళ్లకు చేరండి. మంచిగ అయిన తర్వాత నేను ప్రజల మధ్యన ఉండేవాన్నే కాబట్టి, మనం కలుసుకుందాం. దానికి ఇబ్బంది లేదు. దయచేసి నా కోరికను మన్నించి, నా మాటను గౌరవించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా విజ్ఞప్తిని మీరు తప్పకుండా మన్నిస్తారని భావిస్తున్నాను' కేసీఆర్ పేర్కొన్నారు.