సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (10:10 IST)

హైదరాబాద్‌లో భారీ వర్షం : వరదలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి (Video)

deadbody
హైదరాబాద్ - ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగరులోని బాప్టిస్ట్ చర్చి వద్ద విజయ్ (43) అనే రోజువారి కూలీ మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. నగరంలో వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉందని అందువల్ల ఎవరు కూడా బయటకు రావొద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు భాగ్యనగరి వాసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
 
మంగళవారం నుంచి రేపటి వరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది.
 
మంగళవారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.
 
బుధవారం నుంచి గురువారం వరకు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
గురువారం నుంచి శనివారం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.