1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 మే 2024 (10:56 IST)

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారా? తెలంగాణ మాజీ గవర్నర్ ఏమన్నారు?

tamizhisai
హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆమె మంగళవారం హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. బీజేపీపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చెన్నై సౌత్ నుంచి తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశామన్నారు.
 
తెలంగాణలో తాము అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రధాని మోడీ తెలంగాణలో 22 సార్లు పర్యటించారని, ఎక్కువగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకే హాజరైనట్లు చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొందన్నారు. 
 
కొన్నిచోట్ల మాత్రమే బీఆర్ఎస్ తో పోటీ ఉందన్నారు. బీఆర్ఎస్ చాలా బలహీనపడిందన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ పర్యటనకు కూడా డుమ్మా కొట్టారని గుర్తు చేశారు. గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వలేదన్నారు.
 
తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఐదు రాష్ట్రాల బడ్జెట్ అవసరమని విమర్శించారు. ముఖ్యంగా ప్రతి మహిళకు రూ.2500 హామీ అమలు చేయడం కష్టమన్నారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, విద్యార్థినులకు స్కూటీ వంటి హామీలు అమలు చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాకముందే తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసునని, అయినప్పటికీ హామీలు ఇచ్చారన్నారు. 
 
ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా అమలు కావాల్సి ఉందన్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా కాంగ్రెస్ హామీలు ఇచ్చిందన్నారు.