గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (09:04 IST)

హైడ్రా ఎవ్వరికీ నోటీసులు ఇవ్వదు ... అన్నీ కూల్చివేతలే.. కమిషనర్ రంగనాథ్

ranganath
హైదరాబాద్ నగర పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతుంది. ముఖ్యంగా, నీటి వనరులు, చెరువులు, కుంటలను ఆక్రమించుకుని భవంతులు, ఫామ్ హౌస్‌లు, స్టూడియోలు, కన్వెన్షన్ సెంటర్లు, కాలేజీ, పాఠశాల భవనాలు నిర్మించుకున్న వారికి నిద్రలేని రాత్రులను ఇస్తుంది. ఇప్పటికే తుమ్మిడికుంట చెరువును ఆక్రమించుకుని నిర్మించిన అనేక భవనాలను కూల్చివేసింది. అలాగే, హైదరాబాద్ నగరంలోని నీటి వనరులు ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి వేసే పనుల్లో హైడ్రా బృందం నిమగ్నమైవుంది. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడిలు, విమర్శలు వచ్చినా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. పనిలోపనిగా హైడ్రాపై వస్తున్న విమర్శలకు ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఓవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి అయినా..  ఎవరైనా హైడ్రాకు ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. చెరువులు, నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఏమాత్రం ఆలోచించకుండా వాటిని కూల్చివేస్తామన్నారు. పైగా, హైడ్రా ఎవ్వరికీ నోటీసులు ఇవ్వదని, డైరెక్ట్ కూల్చివేతలే చేస్తుందని తనదైనసైలిలో చెప్పుకొచ్చారు. హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో పాము అవ్వదల్చుకోలేదని తమకు అందరూ సమానమేనని తెలిపారు. 
 
అయితే, విద్యా సంస్థల విషయంలో కాస్త ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యా సంస్థలు బఫర్ జోన్‌లో ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉంటే మాత్రం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటిస్తామన్నారు. ఎఫ్.టి.ఎల్. బఫర్‌లో కట్టిన విద్యా సంస్థలను వెంటనే కూల్చివేస్తే విద్యార్థులు రోడ్డు మీద పడతారని, విద్యా సంస్థరం గందరగోళంగా మారుతుందని, అలాంటి వాటికి మాత్రం కొంచెం సమయం ఇచ్చి ఆ తర్వాత కూల్చివేస్తామని రంగనాథ్ తెలిపారు. అదేసమయంలో హైడ్రా పేదవాళ్ల జోలికి, చిన్నవాళ్ల జోలికి వెళ్లదని ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు.