ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (09:17 IST)

కక్కుర్తి ఎందుకు? సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు.. : హీరో నాగార్జునకు సీపీఐ నారాయణ కౌంటర్

n convention
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత అంశం ఇపుడు అటు చిత్రపరిశ్రమలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ భవనాన్ని పట్టా భూమిలోనే నిర్మించామని, ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించుకోలేదని నాగార్జున పదేపదే వాదిస్తున్నారు. అయితే, హైడ్రా మాత్రం ఈ భవన నిర్మాణం అక్రమంటూ కూల్చివేశారు. 
 
ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతను తాను సమర్థిస్తున్నట్టు చెప్పారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ నగర చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆరంభంలో బుస కొట్టిందని, ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయిందన్నారు. ఇపుడు అక్రమ కట్టడాలను ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి కూల్చేయించడం మంచి నిర్ణయమన్నారు. హీరో నాగార్జున మంచి నటుడు కావొచ్చు.. కానీ కక్కుర్తి ఎందుకు.? సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు.. బుకాయింపు మాటలు వద్దు అంటూ గట్టిగా కౌంటరిచ్చారు. 
 
ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదు.. పక్కా పట్టా స్థలం  : హీరో నాగార్జున 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని తుమ్మిడికుంట చెరువు స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని ఆరోపిస్తూ ఆ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. దీనిపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. ఒక్క అంగుళం స్థలాన్ని కూడా ఆక్రమించలేదని, ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పక్కా పట్టా భూమిలోనే చేపట్టామని తెలిపారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నామని ఆయన మరోమారు స్పష్టం చేశారు. తాము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని, అక్రమ నిర్మాణం చేపట్టలేని పునరుద్ఘాటిస్తూ, ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
"ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు... సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలంటే చాలు... వాటికి అతిశయోక్తులు జోడిస్తుంటారు, మరింత ప్రభావంతంగా ఉండేందుకు ఊహాగానాలు ప్రచారం చేస్తారు. మరోసారి చెబుతున్నా... ఎన్ కన్వెన్షన్‌ను పట్టా భూమిలోనే నిర్మించాం. అన్ని డాక్యుమెంట్లు ఉన్న భూమి అది. ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు. తుమ్మిడికుంట చెరువులో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని ఏపీ భూ సేకరణ చట్టం స్పెషల్ కోర్టు 2014 ఫిబ్రవరి 24న తీర్పు (ఎస్సార్. 3943/2011) వెలువరించింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రాథమిక వాదనలు వినిపించాం. నేను భూ చట్టానికి, తీర్పునకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు, వాస్తవాల వక్రీకరణ, తప్పుదారి పట్టించడం వంటి చర్యల జోలికి వెళ్లొద్దని మిమ్మల్నందరినీ సవినియంగా కోరుతున్నాను" అని పేర్కొన్నారు.