శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (11:07 IST)

ఫోన్ ట్యాపింగ్ కేసు : టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌పై మరో కేసు!

phone tapping
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ కేసు కుదిపిసేతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌పై మరో కేసు నమోదైంది. తన కూతురు పేరిట కొనుగోలు చేసిన ఫ్లాట్ సేల్ డీడ్‌ను బలవంతంగా రద్దు చేయించారంటూ సుదర్శన్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఫిర్యాదులోని వివరాల ప్రకారం, కూకట్ పల్లిలోని విజయనగర్ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్ కుమార్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన స్నేహితులు, ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఎంవీ రాజు, సనత్ నగర్‌కు చెందిన ఏవీకే విశ్వనాథరాజు తమకు చెందిన రాజేశ్వర నిర్మాణ కంపెనీలో పెట్టుబడి పెట్టాలన్నారు. ఇందుకు ప్రతి ఫలంగా 10 శాతం వాటా ఇస్తామని నమ్మించాడు. సుదర్శన్ రూ.60 లక్షలు ఇవ్వగా 2019లో సనత్ నగర్ జేకే కాలనీలోని అపార్టుమెంటులో ఫ్లాటు ఇచ్చారు. దీన్ని తన కుమార్తె పేర రిజిస్టర్ చేయించిన సుదర్శన్.. అందులోనే నివసిస్తున్నారు.
 
రిజిస్ట్రేషన్ తర్వాత రెండు నెలలకు ఎంవీ రాజు సుదర్శనకు ఫోన్ చేసి ఫ్లాటు ఇచ్చినందుకు అదనంగా మరో రూ.5 లక్షలు రావాల్సి ఉందని డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల తరువాత టాస్క్ ఫోర్స్ పోలీసులు సుదర్శన్ ఇంటికొచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు నిర్బంధించి బెల్టుతో కొట్టారు. ఓఎన్డీ రాధాకిషన్ రావు అసభ్యంగా మాట్లాడుతూ వెంటనే ఫ్లాటు ఖాళీ చేయాలనీ, లేకుంటే రాజు చంపేస్తాడని బెదిరించాడు. దీంతో, భయపడిపోయిన సుదర్శన్, ఫ్లాటు సేల్ డీడ్ రద్దు చేసుకున్నారు. భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన తాజాగా కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4 నిందితుడైన రాధాకిషన్ రావును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై నాంపల్లి కోర్టులో బుధవారం విచారణ జరిగింది. పోలీసులు 10 రోజుల కస్టడీ కోరగా న్యాయస్థానం ఏడు రోజులకు అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌ గూడ జైలులో ఉన్న ఆయనను పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.